పార్టీలు మారినా .. ప్రభుత్వం మారదుగా, ఏపీపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ : హోదాపై నిలదీసిన విజయసాయిరెడ్డి

By Siva KodatiFirst Published Feb 7, 2023, 6:44 PM IST
Highlights

కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశాయని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీలు మారినా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై వుంటుందని ఆయన తెలిపారు. 

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి . ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని.. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని, ప్రత్యేక హోదాపై ఇస్తామన్న వాగ్థానాన్ని కూడా బీజేపీ మరిచిపోయిందని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పడు విపక్షంలో వున్న వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని, దీనికి కాంగ్రెస్ పార్టీ సైతం అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. పార్టీలు మారినా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై వుంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.

ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశాయని.. అందుకే ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయం కాదని.. దీనిపై తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

Also REad: ఇప్పుడు జీవో కాపీలే.. రేపు రాజ్యాంగాన్ని కూడా తగులబెట్టేస్తాడేమో : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

ఇక రాజధానిపైనా విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. కేంద్రం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్‌లో చెప్పిందని ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందని చెప్పిన విజయసాయిరెడ్డి.. యూపీ, ఛత్తీస్‌గఢ్‌లను ప్రస్తావించారు. ఈ రెండు రాష్ట్రాల రాజధానులు ఒకచోట.. హైకోర్టులు ఒక చోట వున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో తాము నిర్ణయించుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపెడుతోందన్నారు. 
 

click me!