రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. తాము ఫిర్యాదులు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోపుగా రఘురామకృష్ణంరాజుపై చర్యల గురించి తేల్చాలని వైసీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్‌లో ఆందోళన చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.శుక్రవారం నాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటేయాలని స్పీకర్ కు మరోసారి పిటిషన్ ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.
also read:రఘురామపై మరోసారి అనర్హత పిటిషన్: స్పీకర్ వైసీపీ ఫిర్యాదు
గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులో మార్పులు చేర్పులు చేయాలని స్పీకర్ సూచన చేశారన్నారు. ఈ సూచనకు అనుగుణంగా అనర్హత పిటిషన్ ను మార్చి ఇచ్చామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికీ కూడ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
చట్ట వ్యతిరేకంగా, అసంబద్దంగా సీఎం జగన్ ను కించపరుస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించాడని విజయసాయి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నర్సాపురం ఎంపీ విషయంలో స్పీకర్ తీసుకొనే నిర్ణయం ఆధారంగానే తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు.