అమర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి సీఎం నివాళి... కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటన

By Arun Kumar PFirst Published Jul 9, 2021, 1:42 PM IST
Highlights

దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ జశ్వంత్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. అతడి కుటుంబానికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. 

అమరావతి: దేశ రక్షణ కోసం ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ అండగా నిలిచారు. గుంటూరుకు చెందిన వీరజవాన్    సేవలు వెలకట్టలేనివని... ఈ కష్టసమయంలో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వంతుగా రూ.50లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నట్లు జగన్ ప్రకటించారు. అలాగే ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి అన్నివిదాలుగా అండగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు సీఎం జగన్. 

''జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేసిన వీరుడు జశ్వంత్‌రెడ్డి. అతడి త్యాగం నిరుపమానమైనది. మన జవాన్‌ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నారు'' అంటూ జగన్ నివాళులు అర్పించారు.  

ఇక వీర జవాన్ జశ్వంత్ రెడ్డికి హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా నివాళి అర్పించారు. భారత సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మృతి పట్ల హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి సుచరిత.

read more  ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం... జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం

గురువారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో ఉగ్రవాదులను గుర్తించిన జవాన్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు భారత జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. వీరోచితంగా పోరాడిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.  

అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా వీరమణం పొందారు. మరణించిన జవాన్లలో బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) మృతి చెందారు. ఐదేళ్ల క్రితమే భారత ఆర్మీలో చేరిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉగ్రమూకలతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అతడి మరణవార్తతో కొత్తపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

click me!