
అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజుపై గతంలో ఫోర్జరీ కేసు వుందని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అది రుజువైతే అశోక్ గజపతి రాజు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. విజయనగరానికి తానే రాజునని, చక్రవర్తినని అనుకుంటున్న అశోక్ గజపతి రాజు ఒక దొంగ అని విమర్శించారు విజయసాయిరెడ్డి. కోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి అశోక్ చెలరేగిపోతున్నారని .. కానీ అక్కడ వుండే బోర్డు సభ్యుల్లో ఆయనకి ఒక ఓటు వుంటుందని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచల ట్రస్ట్‌కు వేర్వేరుగా బోర్డులు వున్నాయని .. అశోక్ రాచరికాల మాదిరిగా రాజు చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కొన్ని వందల ఎకరాలను అశోక్ గజపతిరాజు దోచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అతని దందాకు సంబంధించి కొన్ని వివరాలు సేకరిస్తున్నామని ఎంపీ చెప్పారు.
Also Read:దొడ్డిదారిన కుర్చీ ఎక్కారు.. మళ్లీ దించేస్తాం, అశోక్ గజపతిపై డివిజన్ బెంచ్‌కి: విజయసాయిరెడ్డి
అంతకుముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. అశోక్ గజపతి రాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం దేవస్థానం ఛైర్మన్ అయ్యారని ఆరోపించారు . దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తున్నామని తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విజయం సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజును అతి త్వరలో ఛైర్మన్ కుర్చీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దశాబ్ధాలుగా పంచగ్రామాల సమస్య వుందని తెలిపారు. సమస్య పరిస్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరంగా చెప్పామని ఆయన గుర్తుచేశారు. మాన్సాస్ ట్రస్ట్ కింద 14 వేల ఎకరాల భూమి వుందని.. ఆ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజయసాయి తెలిపారు.
అలాగే మాన్సాస్ ట్రస్ట్‌లో 14 విద్యాసంస్థలు వున్నాయని.. పదేళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదని ఆయన ఆరోపించారు. ఆడిటింగ్‌లో అవకతవకలు వున్నట్లు తేలితే సీఎం చర్యలు తీసుకుంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సింహాచల భూముల రక్షణకు ప్రహారీగోడ నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్‌లో లేని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని విజయసాయి వెల్లడించారు.