కరోనా కంటే ప్రమాదకరం.. వెంటనే రాజీనామా చేయాలి: రమేశ్‌పై విజయసాయి ఫైర్

By Siva KodatiFirst Published Mar 15, 2020, 8:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు భగ్గుముంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో రమేశ్‌పై తన అక్కసు వెళ్లగక్కారు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు భగ్గుముంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో రమేశ్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. తాజాగా నిమ్మగడ్డ నిర్ణయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుబట్టారు.

తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేందుకే ఎన్నికలను వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమీషన్‌పై తమకు గౌరవం ఉందని, చంద్రబాబుతో కలిసి రమేశ్ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో ప్రజలే తేలుస్తారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Also Read:రమేశ్‌ను మేం నియమించలేదు.. నేను అడిగింది వేరొకరిని: జగన్ వ్యాఖ్యలపై బాబు కౌంటర్

ప్రతిపక్షనేత ప్రయోజనాలను కాపాడటానికి రమేశ్ రాజ్యాంగ విలువలను కాలరాశారని విజయసాయి దుయ్యబట్టారు. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేశ్ ప్రమాదకరమైన వ్యక్తని, రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయంపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని.. ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని, సంబంధిక ముఖ్య కార్యదర్శులను సంప్రదించకుడా ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.

ఏ అధికారి అయినా వ్యవస్థ అభివృద్ధి కోసం పాటు పడాలని, రాజ్యాంగాన్ని, ఇతర అధికార యంత్రాంగాన్ని సంప్రదించకుండా రమేశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని విజయసాయి మండిపడ్డారు.

Also Read:ఎన్నికల వాయిదాపై జగన్, వైసీపీ నేతల ఆరోపణలు: స్పందించిన ఈసీ రమేశ్ కుమార్

రమేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను నిమ్మగడ్డ రమేశ్ అని పిలవడం కన్నా, నారావారి రమేశ్ అంటే బెటర్ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఆర్టికల్ 243కే ప్రకారం విపత్తుల సమయంలో మాత్రమే ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన గుర్తుచేశారు.

మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో నియమితులైన రమేశ్ కుమార్ ఆయన రుణం తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరో మంత్రి  అవంతి శ్రనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం వైసీపీదేనన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్ల రాకుండా చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. 

click me!