సాక్షి మీడియాకు రఘురామ లీగల్ నోటీసులు: క్షమాపణలకు డిమాండ్, లేకుంటే 50 కోట్ల దావా

By Siva KodatiFirst Published Jun 16, 2021, 6:54 PM IST
Highlights

గత కొన్నిరోజులుగా ఎంపీలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు ఇచ్చారు

గత కొన్నిరోజులుగా ఎంపీలు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించినందుకు గాను బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. 

Also Read:ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

గతంలో కూడా సాక్షి టీవీ చానల్‌కు రఘురామ లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు  ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నేమాని భాస్కర్‌, కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఈ నోటీసు  ఇచ్చారు. ఈ మేరకు కొన్ని కథనాలను కూడా నోటీసుకు జత చేశారు.

కాగా, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా వ్యాఖ్యానించినందుకు గాను రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

అంతకుముందు బుధవారం ప్రధాని మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెస్తోందని, ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని తెలిపారు. ఏపీఎస్డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని ఆయన లేఖలో వివరించారు. ఉచిత పథకాలకు మరో 3వలే కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని పేర్కొన్నారు. విశాఖలో కేటాయించిన భూములను దుబాయ్ కి చెందిన లులు సంస్థకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

click me!