విశాఖ గర్జనలో ఎక్కడ... పేపర్, ఛానెల్ పెట్టుకునే పనిలో వున్నారేమో : విజయసాయిరెడ్డిపై రఘురామ సెటైర్లు

By Siva KodatiFirst Published Oct 15, 2022, 3:41 PM IST
Highlights

మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో శనివారం జరిగిన విశాఖ గర్జనలో విజయసాయిరెడ్డి కనిపించకపోవడంపై సెటైర్లు వేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. పేపర్, ఛానెల్ పెట్టుకునే పనిలో విజయసాయిరెడ్డి వున్నారా అని ఆయన నిలదీశారు.

మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో శనివారం జరిగిన విశాఖ గర్జనకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. విశాఖ గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదని రఘురామ ప్రశ్నించారు. పేపర్, ఛానెల్ పెట్టుకునే పనిలో విజయసాయిరెడ్డి వున్నారా అని ఆయన నిలదీశారు. విశాఖ గర్జన సభ ఫెయిల్ అయ్యిందని.. వైసీపీ నేతలు ఇక్కడికొచ్చి డబ్బాలు కొట్టుకున్నారంటూ రఘురామ దుయ్యబట్టారు. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అనడం సరికాదని.. కాళ్లు అరిగేలా నడుస్తున్న వారిని అలా అంటారా అంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులను అభివృద్ధి చేస్తామంటున్న జగన్.. రాష్ట్రంలో కనీసం రోడ్డు కూడా వేయలేకపోతున్నారంటూ రఘురామ ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వివేకా హత్య కేసును కూడా తేల్చలేని స్ధితిలో జగన్ వున్నారని ఆయన మండిపడ్డారు. 

కాగా... శుక్రవారం కూడా రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని ఆయన అన్నారు. శుక్రవారం రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానులకు మద్ధతుగా కొందరితో రాజీనామాలు చేయిస్తారని, ఆ తర్వాత అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అసెంబ్లీని రద్దు చేస్తారని రఘురామ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం వుందని.. మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. 

ALso Read:ముందు ఒకరిద్దరు.. తర్వాత మూకుమ్మడి రాజీనామాలు, ‘‘ముందస్తు’’ కోసం వైసీపీ ప్లాన్ : రఘురామ వ్యాఖ్యలు

ఇకపోతే... 3 రాజధానులకు మద్ధతుగా ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. రాజధాని ప్రాంత రైతులు అరసవల్లి వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు మూడు రాజధానులకు మద్ధతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు శనివారం మూడు రాజధానులకు మద్ధతుగా జేఏసీ ‘విశాఖ గర్జన’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వైసిపి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దుతుగా ఏర్పడిన జేఏసి నేతలు అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇరువర్గాలు నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఎదురుపడటంతో పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేసారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా జాగ్రత్తపడ్డ పోలీసులు అదుపుచేసారు.

click me!