
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. బాలయ్య అసమర్ధుడు, అమాయకుడని .. లోకేశ్ ఒక కమెడియన్ అని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావుకు పొడిచిన వెన్నుపోటు రక్తపు మరకలను తుడిచేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. తన ప్రయోజనాల కోసమే అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. 1995 టీడీపీ సంక్షోభం సమయంలో వినకపోతే జట్టు పట్టుకుని లాగామని అంటే... అది న్యాయమే, ధర్మమే అని బాలకృష్ణ అన్నారని అంబటి గుర్తుచేశారు.
లోక కల్యాణం కోసమే రామారావుని దించేశారా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని.. రామారావు బతికి వుంటే మీ పరిస్ధితి ఏమిటని ఆయన నిలదీశారు. అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ యాత్ర అని....టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇకపోతే.. నిన్న కూడా బాలయ్య టాక్‌షోపై మంత్రి అంబటి స్పందించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు . తన మాట వినమని! వినల ! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ALso REad:కాళ్లు పట్టుకుంటే వినలేదని.. గొంతు పిసికి చంపేశాడు, ఆయన హీరో కాదు విలన్ : చంద్రబాబుపై అంబటి సెటైర్లు
కాగా... అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే2` షో అక్టోబర్ 14 నుంచి ఇది ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య, చంద్రబాబు మధ్య సంచలనాత్మక విషయాలపై చర్చ జరగడం విశేషం. చంద్రబాబు లైఫ్‌లో అతి పెద్ద నిర్ణయం ఏంటనేది బాలయ్య ప్రశ్నించగా `1995 నిర్ణయం` అని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?.. అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది అని బాలయ్య చెప్పారు.
`ఆయన్ని కాళ్లు పట్టకుని అడుకున్నా నా మాట వినండి అని, కానీ వినలేదని, ఇక వేస్ట్.. ` అని తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. బయట నుంచి వచ్చిన వారి ప్రభావం పెద్దాయన మీద ఎక్కువగా వుందని చంద్రబాబు తెలిపారు. నాడు రామ బాట కోసం ఆంజనేయుడు చేసిన విధంగానే తాము చేస్తున్నామని టీడీపీ చీఫ్ చెప్పారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. చంద్రబాబు ఆనాడు చేసింది తప్పయితే 1999 ఎన్నికల్లో గెలిచేవారు కారని అన్నారు. మొత్తం మీద 1995లో అధికార మార్పిడి నిర్ణయం.. నారా, నందమూరి కుటుంబాలు, టీడీపీ నేతలు తీసుకున్న నిర్ణయంగా బాలయ్య చెప్పుకొచ్చారు.