జగన్‌ ఏ1 అయితే ధర్మాన ఏ5 .. ఇప్పుడేమో నీతిమంతుడిలా మాటలు : టీడీపీ నేత నక్కా ఆనందబాబు

By Siva KodatiFirst Published Oct 15, 2022, 3:12 PM IST
Highlights

మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లలో ధర్మాన ఏ5గా వున్నారని.. జగన్‌తో సహా ముద్దాయిగా వున్న ధర్మాన నీతిమంతుడిలా మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. 

మూడు రాజధానుల వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము, తమ బినామీలు కొట్టేసిన ఆస్తుల్ని కాపాడుకోవడానికే ధర్మన ప్రసాదరావు, ఉత్తరాంధ్రకు చెందిన ఇతర మంత్రులు, ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే వీరంతా జగన్ మూడు ముక్కలాటకు మద్ధతుగా నిలుస్తున్నారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. ధర్మాన ప్రసాదరావు వైసీపీలో వుండి ఉత్తరాంధ్రకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌లలో ధర్మాన ఏ5గా వున్నారని నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. జగన్‌తో సహా ముద్దాయిగా వున్న ధర్మాన నీతిమంతుడిలా మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. 

67 కంపెనీలకు అధిపతిగా వున్న జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని... వ్యాపారవేత్త ప్రజాసేవ చేస్తాడా అని ఇదే అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడలేదా అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. మాజీ సైనికోద్యోగుల భూముల్ని కబ్జా చేసిన ధర్మాన ప్రసాదరావు.. వాటిని కాపాడుకోవడానికే విశాఖలో రాజధాని అంటున్నారని మండిపడ్డారు. ధర్మాన నేతృత్వంలో జరిగిన భూదోపిడిని సిట్ విభాగం కూడా తప్పుపట్టిందని నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. మరిన్ని భూములను కొట్టేసేందుకే ఇప్పుడు ధర్మాన స్కెచ్ వేశారని ఆయన ఆరోపించారు. మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకోవాలని, తన కొడుకుని ఎంపీని చేయాలని ధర్మాన ప్రసాదరావు తాపత్రయపడుతున్నారని ఆనందబాబు ఆరోపించారు. విశాఖవాసులు వైసీపీని పట్టించుకోవడం లేదని... గతంలో తన తల్లిని ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ భావిస్తున్నారని నక్కా ఆరోపించారు. ఉత్తరాంధ్ర వాసులు ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని నమ్మే పరిస్ధితి లేదన్నారు. 

ALso REad:ఉత్తరాంద్ర అభివృద్ది చెందక మా గుండెలు రగిలిపోతున్నాయి: ఏపీ మంత్రి ధర్మాన

ఇకపోతే.. దేశంలోని  అన్ని ప్రాంతాల ప్రజలు  ప్రశాంతంగా నివసించే  పరిస్థితులు విశాఖపట్టణంలో మాత్రమే ఉన్నాయని నిన్న ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  బుధవారం నాడు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఇతర వర్గాల వారు అమరావతిలో నివసించే పరిస్థితులు లేవని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  ఆమోద యోగ్యం కాని నగరంలో రాజధాని ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు మంత్రి. విజయవాడ, అమరావతిలో యాక్సెప్టబుల్ కల్చర్ లేదని మంత్రి తెలిపారు. ఇతరులను అక్కడికి రానివ్వని వాతావరణాన్ని క్రియేట్ చేశారని మంత్రి ధర్మాన ఆరోపించారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు. దీంతో అమరావతిలో ఒక సాధారణ కుటుంబం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ది చెందక ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయని ఏపీ మంత్రి ధర్మాన  ప్రసాదరావు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమ ప్రాంతాన్ని దోచుకొనే కుట్రలు జరుగుతున్నాయని ధర్మాన ఎద్దేవా చేశారు. అభివృద్ది చెందిన నగరాలేవీ కూడా ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవన్నారు. ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందితే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది జరగదని ధర్మాన పేర్కొన్నారు. దీంతో గతంలో ఉద్యమాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా  పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 

click me!