సత్యకుమార్‌పై దాడిలో నా ప్రమేయం లేదు.. అప్పుడు లంక పొలాల్లో వున్నా , నేను వచ్చేసరికే : ఎంపీ నందిగం సురేష్

By Siva KodatiFirst Published Mar 31, 2023, 6:01 PM IST
Highlights

అమరావతి రాజధానిలో బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి వెనుక తన ప్రమేయం లేదన్నారు వైసీపీ నేత నందిగం సురేష్. దాడి జరిగేటప్పుడు తాను లంక పొలాల్లో వున్నానని.. తెలుసుకుని వచ్చేసరికి గొడవ మొత్తం జరిగిపోయిందన్నారు. 
 

అమరావతి రాజధానిలో బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. దీని వెనుక వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రమేయం వుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ స్పందించారు. సత్యకుమార్‌పై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సీ మహిళలను కొట్టమని హైకమాండ్ చెప్పిందా అంటూ బీజేపీ నేతలపై ఆయన భగ్గుమన్నారు. దాడి జరిగేటప్పుడు తాను లంక పొలాల్లో వున్నానని.. తనకు సమాచారం తెలిసి వచ్చేటప్పటికే గొడవ మొత్తం జరిగిందని సురేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి వేరు వేరు కాదన్న ఆయన.. చంద్రబాబు చెప్పిందే ఆదినారాయణ రెడ్డి చేస్తారని స్పష్టం చేశారు. 

Also REad: దాడులు చేయించడం మా సంస్కృతి కాదు: బీజేపీ నేత సత్యకుమార్‌ దాడిపై సజ్జల

Latest Videos

తాము అమరావతి రాజధానిలో ధర్నాలు జరుగుతున్న ప్రాంతంలో గొడవలు పెట్టలేదని నందిగం సురేష్ పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా బీజేపీ నేతలు కొట్టారని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు చేస్తున్న వాళ్లను కొడతారా అంటూ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. రాజధాని రైతుల ఆందోళనకు 1200 రోజులు గడుస్తున్న సమయాన్ని చూసుకుని కావాలనే గొడవ చేశారని నందిగం సురేష్ పేర్కొన్నారు. టీడీపీ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతల దాడి జరిగిందని.. తమకు సంబంధం లేని విషయాలు మాపై రుద్దుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజనులు ఏ పార్టీలో వున్నా అండగా వుంటానని.. తాను ఏపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడినని నందిగం సురేష్ వెల్లడించారు.
 

click me!