నా తల్లి ఆరోగ్యం బాగోలేదు.. చూసుకోవాలి: 7 రోజుల సమయం కోరుతూ సీబీఐకి అవినాష్ లేఖ..

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 11:07 AM IST
Highlights

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మకు లేఖ రాశారు.

కర్నూలు: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మకు లేఖ రాశారు. వివేకా హత్య కేసులో ఈరోజు విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి  తెలిసిందే. అయితే తన తల్లి శ్రీలక్ష్మి (లక్ష్మమ్మ) ఆరోగ్యం బాగోలేదని.. ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని లేఖలో పేర్కొన్న అవినాష్ రెడ్డి.. విచారణకు హాజరుకావడానికి 7 రోజుల సమయం కోరారు. ఈ లేఖకు తన తల్లి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. 

‘‘నా తల్లి గుండె జబ్బు కారణంగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చేరిందని మీకు తెలియజేస్తున్నాను. మీ రిఫరెన్స్ కోసం నేను ఆమె మెడికల్ రిపోర్టులను జత చేశాను. ఆమె వారి సంరక్షణలోనే ఉండాలని వైద్య నిపుణులు సిఫార్సు చేశారు. మా నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఈ క్లిష్ట సమయంలో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. 160 సీఆర్‌పీసీ కింద నా విచారణ వాయిదాను 7 రోజులు పొడిగించాలని అభ్యర్థిస్తున్నాను’’ అని అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో తన తల్లి చూసుకోవడానికి, ఆమెకు అవసరమైన సహాయం అందజేసేందుకు వీలు కల్పిస్తుందని  అన్నారు. 

Also Read: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏం చెప్పారంటే..?

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మే 16, మే 19వ తేదీల్లో రెండు విచారణ తేదీలను అవినాష్ రెడ్డి దాటవేశారు.తాజా ఈరోజు(మే 22) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న విచారణకు హాజరయ్యేందుకు 5 రోజుల సమయం కావాలని  కోరారు. ఇక, ఈ నెల 19 నుంచి అవినాష్ రెడ్డి తన తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలో ఉండిపోయారు.

అయితే ఈరోజు ఉదయం సీబీఐ అధికారులే నేరుగా కర్నూలుకు చేరుకోవడంతో ఏ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు జరుపుతున్నారు. శాంతి భద్రతలకు సంబంధించి సీబీఐ అధికారులు ఎస్పీతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం ఉందని సీబీఐ అధికారులు చెప్పినట్టుగా సమాచారం. 

click me!