బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన..

By Sumanth KanukulaFirst Published May 22, 2023, 10:33 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, కాసేపట్లో మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ  సభ వేదిక వద్దకు చేరకోనున్న సీఎం జగన్.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

మచిలీపట్నం పోర్టు విషయానికి వస్తే.. భూసేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.5,155.73 కోట్లుగా ఉంది. 35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌–కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో  నిర్మాణం చేపట్టనున్నారు. మచిలీపట్నం పోర్టును 24–30 నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుందని  చెబుతున్నారు. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 

ఇక, బందర్ పోర్టు నిర్మాణంతో కృష్ణా జిల్లా ముఖాచిత్రం మారుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆరు ఓడరేవులు మాత్రమే నిర్మించగా.. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లలో నాలుగు కొత్త ఓడరేవుల నిర్మాణాన్ని ప్రారంభించినట్టుగా చెప్పాయి. 
 

click me!