వివేకా కేసు.. రేపు విచారణకు రాలేను , సీబీఐకి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ

By Siva KodatiFirst Published May 21, 2023, 8:18 PM IST
Highlights

కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. సోమవారం నాటి విచారణకు తాను హాజరుకాలేనని ఆయన పేర్కొన్నారు. తన తల్లి అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని ఆమె డిశ్చార్జ్ అయిన వెంటనే విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా సోమవారం నాటి విచారణకు తాను హాజరుకాలేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తన తల్లి ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదని .. ఆమె కోలుకున్న వెంటనే విచారణకు వస్తానని అవినాష్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే అవినాష్ రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. 

తొలుత ఈ నెల 16న అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే ఈ క్రమంలోనే విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల సమయం కోరుతూ  సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

Also Read: వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

గత శుక్రవారం అవినాష్ రెడ్డి విచారణకు బయల్దేరుతుండగా.. ఆయన తల్లి లక్ష్మీ అనారోగ్యానికి గురయ్యారని తెలిసి అటు నుంచి అటే పులివెందులకు బయల్దేరారు అవినాష్ రెడ్డి. ఈ సమాచారాన్ని అవినాష్ తరపు న్యాయవాదులు సీబీఐ అధికారులకు తెలియజేశారు. వైఎస్ లక్ష్మీని పులివెందుల నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావడంతో అవినాష్ తల్లిని పరామర్శించి, ఆమె వెంటే వుండిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. 

click me!