Bengaluru Rains: బెంగళూరులో ఆంధ్రా యువతి దుర్మరణం.. అండర్‌పాస్‌లోని వరద నీటిలో కారు మునిగి..!

By Mahesh KFirst Published May 21, 2023, 6:04 PM IST
Highlights

విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు వరద నీటిలో చిక్కుకున్నారు. కేఆర్ సర్కిల్ వద్ద గల అండర్ పాస్‌లో నిలిచిన వరద నీటి గుండా పోదామని కారును ముందుకు తీయడంతో అది అందులో చిక్కుకుపోయింది. ఆరుగురిని స్థానికులు బయటకు తీయగలిగారు. కానీ, 22 ఏళ్ల భానురేఖ ఆరోగ్యం విషమంగా మారింది. ఆమె హాస్పిటల్‌లో మరణించింది.
 

బెంగళూరు: కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. విజయవాడ నుంచి బెంగళూరుకు కుటుంబంతోపాటు వెళ్లారు. మరణించిన యువతిని 22 ఏళ్ల భానురేఖగా గుర్తించారు. వేసవి సెలవులు ఉండటంతో భాను రేఖ కుటుంబం బెంగళూరు వెళ్లింది. బెంగళూరులో వారు కారులో ప్రయాణించారు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో డ్రైవ్ చేస్తుండగా.. బెంగళూరులో అసెంబ్లీ నుంచి 200 మీటర్ల దూరంలోని కేఆర్ సర్కిల్ వద్ద గల అండర్‌పాస్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరింది చూశారు. కానీ, ఆ నీటిని అంచనా వేయకుండా కారును ముందుకే పోనిచ్చారు. కారు అందులో నుంచి బయటకు వెళ్లుతుందని అనుకున్నారు. కానీ, నీటిలో చిక్కుకుపోయింది. కారులో నీరు చేరింది. ఆరుగురు కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బయటకు రాగలిగారు. కానీ, ఆ యువతి నీటిని మింగడంతో శ్వాస ఇబ్బందిగా మారింది. ఆమెను హాస్పిటల్‌ తీసుకెళ్లగా.. అక్కడే మరణించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

కర్ణాటకలో భీకర వర్షం కురిసింది. మెరుపు వేగంతో వీచిన గాలులు, కుండపోత వర్షాలతో నగరంలో చాలా చోట్ల స్వల్ప సమయంలోనే వరద నీరు నిలిచింది. విజయవాడ నుంచి వెళ్లిన ఆ కుటుంబం రోడ్లపై నిలిచిన వరద నీటిని తక్కువ అంచనా వేసింది. కేఆర్ సర్కిల్ వద్ద గల అండర్‌పాస్‌లో వరద నీరు ఉన్నదని తెలిసి కూడా అలాగే ముందుకు పోయారు. కారు చిక్కుకుపోవడంతో అందులో నుంచి వారు రక్షించాలని కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించారు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరారు. కారులో నుంచి వారు బయటకు రావడానికి స్థానికులు చీరలు, తాళ్లు విసిరారు. వాటిని పట్టుకుని కొందరు బయటకు వచ్చారు. ఆ కారు నీటిలో మునిగిపోకుండా కూడా వీటి ద్వారా పట్టుకోగలిగారు. మిగిలిన కొందరిని నిచ్చెన సహాయంతో బయటకు తీసుకువచ్చారు.

Also Read: Telangana: బర్త్ డే నాడే గుండెపోటుతో బాలుడు హఠాన్మరణం.. బర్త్ డే వేడుక చేసిన తర్వాతే అంత్యక్రియలు.

వారిని వెంటనే సెయింట్ మార్థా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సకాలంలో చికిత్స అందక ఆ యువతి మరణించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మిగిలిన ఐదుగురికి మాత్రం చికిత్స అందుతున్నది.

click me!