
తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా (srikakulam district)కు చెందిన టిడిపి కార్యకర్త వెంకట్రావు (venkatrao suicide) ఆత్మహత్య ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడుక్కించింది. ఈ ఆత్మహత్యకు వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (duvvada srinivas) కారణమని... పోలీసుల సాయంతో వేధించడం వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నాడని టిడిపి ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను తిప్పికొడుతూ టిడిపిలోకి కీలక నాయకులపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu), ఆయన తనయుడు లోకేష్ (nara lokesh), శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు (atchannaidu) తన హత్యకు కుట్ర పన్నారని... ఇందుకోసం వెంకట్రావును వాడుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఈ కుట్ర బయటకు వస్తుందనోనని వెంకట్రావు చావుకు వారు కారణమయ్యారని వైసిపి ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని కుట్ర కోణాన్ని ఛేదించాలని దువ్వాడ కోరారు.
''శ్రీకాకుళం జిల్లా మందస మండలం పోతంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్యకు ముందు అచ్చెన్నాయుడు రక్త చరిత్ర ఏమిటో ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. సొంత నియోజకవర్గం, సొంత ఊరు నిమ్మాడలో ప్రతిసారీ సర్పంచ్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచేందుకు కింజారపు కుటుంబం దారుణాలకు పాల్పడ్డారు, ఇప్పటివరకు ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులలో నలుగుర్ని చంపిన చరిత్ర ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడులది. ఆ నియోజకవర్గంలో వారి ఏకఛత్రాధిపత్యానికి అడ్డుగా నిలిచిన ఏడుగురిని చంపిన రక్త చరిత్ర వారి కుటుంబానిది. వీరి చరిత్రను చూసి నిమ్మాడ పంచాయతీలో నామినేషన్లు వేయడానికి ఎవరూ ముందుకురారు'' అని దువ్వాడ తీవ్ర ఆరోపణలుచేసారు.
''అయితే వారిని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన వ్యక్తి కింజారపు అప్పన్న. ఆ ఎన్నిక పూరై ఏడాదిన్నర గడిచిన తర్వాత ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అప్పన్నను బెదిరిస్తూ టీడీపీ కార్యకర్త వెంకట్రావు ఆడియో లీక్ బయటకు వచ్చింది. అప్పన్నను వెంకట్రావు బెదిరిస్తూ "అరే అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్ సహకారంతో నామినేషన్ వేశావు, నీ కుటుంబమైన అచ్చెన్నాయుడు పక్షాన ఉండకుండా పోటీకి నిలబడ్డావు, నీ సంగతి చూస్తాం, రెండేళ్ళ లోపే దువ్వాడ శ్రీనివాస్ కాళ్ళు చేతులు తీసేసి, చంపేస్తాం" అని ఆడియో పోస్ట్ చేశాడు'' అని వైసిపి ఎమ్మెల్సీ వెల్లడించారు.
''వాస్తవానికి నేను శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఇక్కడ ఉంటే.. సదరు వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ఆత్మహత్యకు కారకుడు నేనే(దువ్వాడ శ్రీనివాస్) అంటూ, నన్ను అరెస్టు చేయాలని చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ లు మాట్లాడుతున్నారు. అసలు నేను చేసిన తప్పేంటి...? ఆత్మహత్యకు, నాకు సంబంధం ఏమిటి..? వెంకట్రావుకి, నాకు ఏం సంబంధం..? అతనెవరో తెలియదు. నేను ఎప్పుడూ చూడలేదు. ఆ పేరు కూడా వినలేదు... ఆయనేదో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అయితే.. అతని ఆత్మహత్యకు, నాకు సంబంధం ఏమిటి..? ఏ సంబంధం లేకుండానే టీడీపీ నేతలంతా కలిసి ఓ కుట్ర పన్ని, ఆ కుట్రను కప్పిపుచ్చేందుకు నాపై ఆరోపణలు చేస్తూ, అభూత కల్పనలు మాట్లాడుతున్నారు'' అన్నారు.
'' రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ప్రజల్లో శాశ్వతంగా భూస్థాపితం అయిన అచ్చెన్నాయుడు అండ్ కో.. గత కొంతకాలంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా అంతు చూడాలి, నన్ను తుదముట్టించాలన్నదే వీరి లక్ష్యం. హత్యా రాజకీయాలు వీరికి వెన్నతో పెట్టిన విద్య అన్నది అందరికీ తెలుసు'' అని దువ్వాడ మండిపడ్డారు.
''కింజారపు అప్పన్నకు ఆడియో ద్వారా బెదిరిస్తూ, వార్నింగ్ ఇచ్చిన వెంకట్రావును అప్పన్న టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే విచారణకు పోలీసులు పిలిచారు. అతను అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ కు రావాలని సమాచారం ఇచ్చి పోలీసులు తిరిగి వచ్చారు. జిల్లా ఎస్పీ విచారణలో కూడా ఇదే తేలింది. వెంకట్రావుని పోలీసులు కేవలం విచారణ కోసమే రమ్మన్నారు. అంతకుమించి ఎటువంటి వేధింపులకు గురి చేయలేదు'' అని దువ్వాడ స్పష్టం చేసారు.
''ఆడియో లీక్ ప్రకారం వాస్తవాలు విచారిస్తే... అసలు నన్ను చంపేస్తామని బెదిరింపు కాల్ ద్వారా ఆడియో చేసింది ఎవరు... అతనికి అచ్చెన్నాయుడుకు సంబంధం ఏమిటో తెలుస్తుంది. అచ్చెన్నాయుడు ఒక పథకం ప్రకారమే ఏడాది కాలంగా నన్ను హత్య చేయాలని ఎదురు చూస్తున్నాడు . ఇందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వెంకట్రావును పావుగా వాడుకున్నాడు. నన్ను చంపాలని అచ్చెన్నాయుడు, వెంకట్రావును పురమాయించాడు. వీరి ప్లాన్ ను అప్పన్నను బెదిరించడం ద్వారా... ప్రీ ప్లాన్డ్ గా ఆడియో రూపంలో బయట పెట్టాడు. ఈ ఆడియో ముందుగానే బయటకు రావడం, రేపు వెంకట్రావు తమ పేర్లు బయట ఎక్కడైనా చెబుతాడేమో అని, అతను బతక కూడదని అచ్చెన్నాయుడే వెంకట్రావును చంపి, ఆ వ్యక్తి చావుకు నేను కారణమని ఈరోజు మాట్లాడుతున్నారు'' అని పేర్కొన్నారు.
''ఈ కుట్ర నీది కాదా అచ్చెన్నాయుడు.. కాదని చెప్పే దమ్ముందా నీకు...?. నీవు చెప్పినా, చెప్పకపోయినా రేపోమాపో వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి. అసలు వెంకట్రావు చనిపోక ముందే గౌతు శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా కూర్చుంది. శిరీష మొసలి కన్నీరు ఏంటి.. ఆ కన్నీళ్ళ వెనుక కుట్ర ఏమిటి. కుట్ర కోణం ఏమిటి.. ? టీడీపీ నేతలంతా ఆత్మహత్యను ఎందుకు రాజకీయం చేయాలని చూశారు..? దర్యాప్తు జరగకుండానే, అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్.. స్థానిక టీడీపీ నేతలంతా.. నాపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేయడం, ట్వీట్లు పెట్టడం ఏమిటి..? నిజనిజాలు తెలుసుకోకుండా, వీళ్ళంతా ఇక్కడ కూర్చుని, నన్ను అరెస్టు చేయండి, విధుల నుంచి తప్పించండి.. అంటూ ఆర్డర్లు పాస్ చేయడం ఏమిటి? టీడీపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో నన్నుఇరికించాలని చూస్తున్నారు'' అన్నారు.
''గతంలో మీరే నాపై 18 కేసులు పెట్టినా అదరలేదు, బెదరలేదు. ఇప్పుడు బెదురుతానా..? మీ పార్టీ కార్యకర్త అయినప్పుడు, ఆ కుటుంబానికి అండగా ఉండండి, ఆదుకోండి. వెంకట్రావుని పోలీసులు విచారణకు పిలిస్తే, మీకు అంత ప్రేమే ఉంటే, అతనితోపాటు టీడీపీ నాయుకులు కూడా వెళ్ళి పోలీసులతో మాట్లాడవచ్చు కదా.. ఎందుకు అలా చేయలేదు'' అని నిలదీసారు.
''మీరు అధికారంలో ఉండగా, కేసులు పెట్టి ఎన్నో రకాలుగా హింసించినా, మేము అధికారంలో ఉన్నప్పటికీ చీమకు కూడా హాని చేయని నన్ను అంతమొందించాలని మీరు చూస్తున్నారు. టెక్కలిలో నేను పోటీలో ఉంటే.. మీ ఆటలు సాగవనే భయంతో నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వెంకట్రావు ఆడియో లీక్ అయింది. మీ తాలుకా కుట్రలు ఎక్కడ బయటపడతాయోనని నాపైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తే.. వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ కుట్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ లు ఉన్నారు. వారందర్నీ అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాను'' అని వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.