
నెల్లూరు: మహిళా దినోత్సవం రోజే విదేశీ పర్యాటకురాలి (foreign traveler)పై కొందరు దుండుగులు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటన నెల్లూరు జిల్లా (nellore district)లో చోటుచేసుకుంది. ఏపీలో జరిగిన ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్టనే దిగజార్చేలా వుంది. దీంతో ఈ ఘటనను ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకుని కేవలం గంటల వ్యవధిలోనే అత్యాచాయత్నానికి పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసారు.
నెల్లూరు ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లిథువేనియా దేశానికి చెందిన కరోలినాకు బస్సులో నిందితుడు సాయికుమార్(28) పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామానికి తీసుకువెళ్లాడు. అక్కడినుండి మరో స్నేహితుడు షేక్ అబిద్(26) తో కలిసి కరోలినాను సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వారి చెరనుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేసారు.
దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన గూడూరు పోలీసులను నెల్లూరు ఎస్పీ అభినందించారు. విదేశీ మహిళపై అత్యాచాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులపై Cr.No.16/2022 u/s 354-A, 376 r/w 511, 120 (b) IPC కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ జిల్లా పోలీసు యంత్రాంగం ముందుంటుందని ఎస్పీ తెలిపారు.
లిథువేనియా దేశీనికి చెంది కరోలినా వరల్డ్ ట్రావెలర్. దేశవిదేశాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవన విధానాలను తెలుసుకుంటుంది. ఇలా ఇటీవల మన పొరుగుదేశం శ్రీలంకలో పర్యటించిన ఆమె ఇండియాకు వచ్చింది. శ్రీలంక నుండి చెన్నై విమానాశ్రాయానికి వచ్చిన ఆమె రోడ్డు మార్గంలో గోవాకు వెళ్లడానికి సిద్దమయ్యింది.
ఈ క్రమంలోనే కరోలినా చెన్నై నుండి బెంగళూరుకు వెళుతుండగా ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో ఆమెను బస్సులోంచి దింపేయడానికి డ్రైవర్ సిద్దపడ్డాడు. అదే బస్సులో మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాలెంకు చెందిన సాయికుమార్ కూడా ప్రయాణిస్తున్నాడు. విదేశీ మహిళ పరిస్థితిని అర్థం చేసుకున్న అతడు ఆమెకు టికెట్ డబ్బులిచ్చాడు. దీంతో కరోలినా అతడిని పరిచయం చేసుకుంది.
సాయం చేయడం వరకు బాగానే వున్నా ఆమెతో పరిచయం తర్వాత సాయికుమార్ కు దుర్భుద్ది కలిగింది. ఎలాగయినా విదేశీ మహిళను అనుభవించాలని భావించిన అతడు మాయమాటలతో నమ్మించి తన గ్రామం వెంకన్నపాలెం తీసుకెళ్లాడు. అక్కడినుండి తన స్నేహితుడు షేక్ అబిద్ తో కలిసి మహిళను బైక్ పై ఎక్కించుకుని సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఈ ఇద్దరు కరోలినాపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వారి చెరనుండి తప్పించుకున్న కరోలినా స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.
సమాచారము అందిన వెంటనే నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ విజయ రావు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. ఆయన ఆదేశాలతో గూడూరు డిఎస్పీ, రూరల్ సీఐ పర్యవేక్షణలో సైదాపురం, మనుబోలు ఎస్సై సారథ్యంలో టీమ్ లు ఏర్పడి అనుమానితులను ప్రశ్నించారు. సాంకేతికత ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు చిల్లకూరు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన గంటలలోనె ముద్దాయిలను అరెస్ట్ చేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.