
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో వున్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ వుంటారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను తాను విజనరీగా ప్రొజెక్ట్ చేసుకుని ప్రజలకు ఏం చేయకపోవడం ఆయన నైజమన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల మైండ్ సెట్ బాగోలేదని.. ఈవీఎంలు తప్పని ఆరోపణలు చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. జగన్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. కుట్రలు పన్ని కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌పై ద్వేషంతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
అమరావతి రైతుల పాదయాత్రని తాను తప్పుపట్టడం లేదని.. పాదయాత్రలో మాట్లాడిన మాటలు రాయలసీమ వాసిగా తనకు బాధ కలిగించాయన్నారు. మూడు రాజధానులు చేస్తే రాయలసీమకి చుక్క నీరు ఇవ్వమని అంటున్నారని ఆయన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అయితే మధ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమం చేస్తామంటున్నారని.. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు వున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారణం చంద్రబాబేనని.. ప్రాంతాల మధ్య ఎందుకు విద్వేషాలు పెంచుతున్నారని ఆయన నిలదీశారు.
ALso REad:అమరావతి రైతుల యాత్రకు భద్రత కల్పించండి : అమిత్ షాకు రఘురామ లేఖ
అమరావతి రాజధానిని రాయలసీమ ప్రజలు వ్యతిరేకించలేదని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. రాయలసీమలో న్యాయ రాజధాని వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము ఏ ప్రాంతానికి, కులానికి వ్యతిరేకం కాదన్న ఆయన.. విశాఖ, కర్నూల్ అభివృద్ధి కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. మిగిలిన ప్రాంతాలని అవమానించేలా పాదయాత్ర చేస్తున్నారని.. రాయలసీమని చంద్రబాబు అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజ్‌లు రాకుండా అడ్డుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే అసెంబ్లీకి వస్తే ప్రభుత్వ విధి విధానాల పై చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు ఇలానే కుట్రలు చేస్తే అంతు తెలుస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. విశాఖ పరిపాలన రాజధాని వద్దు అనే వాళ్ళు చరిత్ర హీనులని ఆయన దుయ్యబట్టారు.