ఏపీ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల అక్రమాల విషయంలో ఐదుగురిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 169.27 ఎకరాల విసయంలో అవకతవకలపై ఐదుగురిరని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల అక్రమాల విషయంలో ఐదుగురిని మంగళవారం నాడు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిలోని 1100 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే ఇందులోని 169.27 ఎకరాలకు సంబంధించిన భూముల విషయంలో చోటు చేసుకున్న అవకతవకలపై ఐదుగురిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గడ్డం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ సీఐడీ ప్రకటించింది. అసైన్డ్ భూముల విషయంలో మాజీ మంత్రి నారాయణ బంధువులపై కూడ ఆరోపణలున్నాయి.
మాజీ మంత్రి నారాయణ ఆయన బంధువులు 89 ఎకరాలను రాజధాని పరిసర గ్రామాల్లో కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపించింది. ఈ విషయమై రామకృష్ణ హౌసిండ్ డైరెక్టర్ ఖాతాల నుండి డబ్బులు బదిలీ చేసినట్టుగా సీఐడీ గుర్తించింది.
undefined
అనంతవరం,కృష్ణయ్యపాలెం, లింగాయపాలెం, కోరగల్లు, మందడం, నవులూరు,రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంకటపాలెం గ్రామాల్లోని వేర్వేరు సర్వె నెంబర్లలోని అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ తెలిపింది. ఈ వ్యవహరంలో రూ. 15 కోట్లు చేతులు మారాయని సీఐడీ నిర్ధారించింది. అసైన్డ్ భూముల అక్రమాల విషయమై సీఐడీ మరింత డూకుడును పెంచిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
అమరావతిలోని అసైన్డ్ భూముల విషయమై విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి పిర్యాదు చేశారు.ఈ పిర్యాదుపై సీఐడీ విచారణ నిర్వహిస్తుంది. అసైన్డ్ భూములు ఎలా చేతులు మారాయనే విషయమై సీఐడీ దర్యాప్తు చేస్తుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే ఈ భూములు చేతులు మారాయయని వైసీపీ ఆరోపిస్తుంది. టీడీపీకి చెందిన కీలక నేతలు భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపణలు చేసింది.ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘం నివేదికను కూడా ఇచ్చింది.