టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మండిపడ్డారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి . అసలు ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికుందని నల్లపరెడ్డి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మండిపడ్డారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి జైల్లో ఓ దొంగ వున్నాడని వ్యాఖ్యానించారు. తన భద్రతకు ముప్పు వుందని, హత్య చేయడానికి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని చంద్రబాబు లేఖ రాశారని.. అసలు ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికుందని నల్లపరెడ్డి ప్రశ్నించారు.
ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసి అరెస్ట్ కాకుండా , జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరిగాడని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. పాపం పండింది కాబట్టే చంద్రబాబు ఇప్పుడు స్కిల్ కేసులో దొరికాడడని నల్లపరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఏడుపులు ఏడ్చినా.. దత్తపుత్రుడితో కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం వుందని.. మరోసారి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అనుకుంటున్నారని నల్లపరెడ్డి పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు వల్లే 29 మంది ప్రాణాలు పోయాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో రైతులపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడని.. ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేశాడని నల్లపరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా దించేసి ఆయనను మానసికంగా హత్య చేసిన వారిలో ఆయన పిల్లలు కూడా వున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
నారా భువనేశ్వరి ముందు తన తండ్రికి క్షమాపణలు చెప్పాలని.. ఎన్టీఆర్‌లో తాము భగవంతుని చూసుకున్నామని. కానీ ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినవారు ఈరోజు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని నల్లపరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య ఏం మాట్లాడతాడో అతనికే అర్ధం కాదని.. ఆయనకు తెలుగే రాదని , పప్పు సంగతి అందరికీ తెలిసిందేనని చురకలంటించారు.