పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలు కావాలట : ఆ ‘‘ పెద్ద కుటుంబాలు’’ అంటూ కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 21, 2023, 5:11 PM IST
Highlights

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలకు చెందిన కుటుంబాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకులు, బామ్మర్దులు చివరికి పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలుగా వుండాలని వాళ్లు అనుకుంటున్నారని కోటంరెడ్డి అన్నారు.

నెల్లూరు జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదలన జిల్లాలోని కొన్ని పెద్ద కుటుంబాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. వాళ్లు ఎన్నోసార్లు తన గొంతు కోశారని కోటంరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఎమ్మెల్యేలుగా వుంటూ.. కొడుకులు, బామ్మర్దులు చివరికి పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలుగా వుండాలని అనుకుంటున్నారని కోటంరెడ్డి అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు తమకే కావాలని అంటున్నారని .. ఇకపై వారి ఆటలు సాగవని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. 

కాగా.. ఇటీవల అధికారులతో సమీక్ష సందర్భంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు. మంత్రులు మారినా పనులు జరగడం లేదంటూ శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా వున్నప్పుడు హామీ ఇచ్చిన పనులు ఇంకా మొదలు కాలేదని ఆయన దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలోని కొత్త రోడ్ల నిర్మాణంపైనా కోటంరెడ్డి అధికారులపై మండిపడ్డారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా చూసి జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ మంత్రి కాకాణి ముందే కోటంరెడ్డి శ్రీధన్ రెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. 

ALso REad: సొంత ప్రభుత్వం, అధికారులపై విమర్శలు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాడేపల్లి నుంచి పిలుపు..రేపు జగన్‌తో భేటీ

ఇదిలావుండగా.. గతేడాది జూలైలోనూ  రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగి కలకలం రేపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది అని కోటంరెడ్డి తెలిపారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని, దీని మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ప్రశ్నించానని అన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు.  

తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా.. అధికారులతో మాట్లాడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారమా? ప్రతిపక్షమా?  అనేది ఉండదని..  ప్రజల పక్షమే ఉంటుందని అన్నారు. తాను ఆ పక్షమే ఉంటానని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తాను కూడా బాధపడుతున్నానని అన్నారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారులు నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 

click me!