చంద్రబాబూ..! రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు: నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Aug 27, 2019, 3:56 PM IST
Highlights

ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మాణం అంటూ వేలాది కోట్లు రూపాయలు దోచుకుని ఇక దోచుకోలేమేమోనన్న భయంతో టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈతకాయని తీసుకొచ్చి తాటికాయగా చూపాలనుకుంటున్నారని మండిపడ్డారు. 
 

విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. 

రాజధాని ప్రాంతం ముంపు కాదంటున్న చంద్రబాబు ఎందుకు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదో చెప్పాలని నిలదీశారు. వరదలు వస్తున్నాయని తెలిసే ముందే కుటుంబతో కలిసి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదంటూ విరుచుకుపడ్డారు. 
 
మాజీమంత్రి సుజయ్ కి కౌంటర్
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి సుజయ్ కృష్ణరంగరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బాధ్యతతోనే మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు. 

ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మాణం అంటూ వేలాది కోట్లు రూపాయలు దోచుకుని ఇక దోచుకోలేమేమోనన్న భయంతో టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈతకాయని తీసుకొచ్చి తాటికాయగా చూపాలనుకుంటున్నారని మండిపడ్డారు. 

ఐదుగురు ఉపముఖ్యమంత్రుల మాదిరిగానే ఏపీలో ఐదు రాజధానులు పెడతారేమోనంటూ మాజీమంత్రి సుజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుగురికి ఉపముఖ్యమంత్రులు ఇవ్వడంపై ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనారిటీలంటే తెలుగుదేశం పార్టీకి ఎంతటి చిన్నచూపో ఈ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతుందన్నారు.  

ఇసుక విధానంపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తామన్న మాజీమంత్రి సుజయ్ వ్యాఖ్యలను స్వాగతించారు. ఇసుక విధానం పై వినతి పత్రం ఇవ్వడం సంతోషకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇసుకపై స్పందించలేదు గానీ అధికారం పోయాక స్పందించారు సంతోషం అంటూ సెటైర్లు వేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చేసిన ఇసుకమాఫియాను అరికట్టారని చెప్పుకొచ్చారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుకపాలసీని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు. 

రోజుకి ఆరు యూనిట్ల చొప్పున తహశీల్దారు కార్యాలయం ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని తెలిపారు. కొంత కాలం వేచి ఉండాలని కోరినా రాజకీయ ఉనికి కోసం టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఇసుక అక్రమ రవాణాకు అలవాటుపడిన టీడీపీ నేతలు కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సాక్షాత్తు మహిళ తహశీల్దారు వనజాక్షిపై దాడులు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఐదుగురు ఉపముఖ్యమంత్రులు మాదిరిగా 5రాజధానులు చేస్తారేమో..?: జగన్ పై మాజీ మంత్రి సుజయ్ సెటైర్లు

click me!