పవన్ పై విరుచుకుపడ్డ గ్రంథి శ్రీనివాస్.. ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అంటూ...

By AN TeluguFirst Published Mar 15, 2021, 1:20 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వెఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని మండిపడ్డారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వెఎస్సార్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని మండిపడ్డారు. 

ఇక్కడ విలువలు, సిద్ధాంతాలు ఉంటాయని హితవు పలికారు. మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలను మోసం చేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అందుకే బాబు, పవన్ నీచ రాజకీయాలను తిరస్కరించారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. 

ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తుపై పవన్ కాస్త అసహనంగా ఉన్నాడా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఆదివారం తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణికి మద్దతు పలికారు. బిజెపి అభ్యర్థి రామచంద్రరావు బరిలో ఉన్నప్పటికీ ఆయన ఆ పనిచేశారు. పైగా, ఓటింగ్ జరుగుతున్న రోజున ఆయన వాణికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో బిజెపితో ఆయన దూరం జరిగేందుకు సిద్ధపడినట్లు భావిస్తున్నారు.

సురభివాణికి మద్దతు పలికినందుకు ఆయన ఈసీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. 
సురభి వాణికి మద్దతు తెలుపుతూ పవన్ కల్యాణ్ హైదరాబాదులో ప్రకటన చేయగా, విజయవాడలో జనసేన ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ బిజెపిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి వల్లనే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ బిజెపితో దోస్తీపై స్పష్టత ఇవ్వడం వల్లనే పోతిన మహేష్ ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు. పోతిన మహేష్ ప్రకటనను బట్టి కూడా జనసేన బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లు భావిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ బిజెపిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు బిజెపి రాష్ట్ర నాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని జనసేన నాయకులు తన దృష్టికి తెచ్చారని, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయాలని చెప్పే ధైర్యం తనకు లేదని ఆయన ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే పోతిన మహేష్ ఓ వీడియో విడుదల చేశారు. బిజెపి విధానాల వల్లనే విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. బిజెపి విధానాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బిజెపిపై పోతిన మహేష్ ప్రకటనను బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందని అంటున్నారు.

click me!