మైదుకూరు ఉత్కంఠ: జగన్ కు డిఎల్ రవీంద్రారెడ్డి షాక్, ఎత్తుకు పైయెత్తులు

By telugu teamFirst Published Mar 15, 2021, 12:51 PM IST
Highlights

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. వైసీపీ కౌన్సిలర్ తో టీడీపీకి ఓటు వేయిస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీలు ఎత్తులకు పైయెత్తులు వేయిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ వైసీపీ కౌన్సిలర్ తో టీడీపీకి ఓటు వేయిస్తానని డీఎల్ రవీంద్రా రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, టీడీపీ 12 వార్జులను గెలుచుకుంది. వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. జనసేన ఒక్క వార్డును గెలుచుకుంది. ఆరో వార్డును జనసేన దక్కించుకుంది. కాగా, వైసీపీకి ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు. దీంతో వైసీపీ ఓట్లు 13కు పెరిగాయి. దీంతో జనసేన కౌన్సిలర్ ఓటు కీలకంగా మారింది. జనసేన కౌన్సిలర్ తమకే మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అయితే, టీడీపీకి డిఎల్ రవీంద్రా రెడ్డి ఇచ్చిన హామీ అమలులోకి వస్తే వైసీపీకి షాక్ తగిలే అవకాశం ఉంది. వైసీపికి చెందిన ఓ కౌన్సిలర్ తో టీడీపీకి ఓటు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లుర తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్లకు గాలం వేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. 

కాగా, తమ కౌన్సిలర్లను పోలీసులు బలవంతంగా తీసుకుని వెళ్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అవసరమైతే ఆ విషయంపై తాము కోర్టుకు వెళ్తామని వారు చెబుతున్నారు. మొత్తం మీద మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్తంఠను రేకెత్తిస్తోంది. ఈ నెల 18వ తేదీన చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. 

రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. తాడిపత్రి, మైదుకూరు మాత్రమే వైసీపీ చేయి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వైసీపీ ఎత్తులు పారితే ఫలితం తారుమారు కావచ్చు.

click me!