ఏపీ మూడు రాజధానులు : హైకోర్టు తీర్పుపై ధర్మాన అసహనం, అసెంబ్లీలో చర్చించాల్సిందే.. జగన్‌కు లేఖ

Siva Kodati |  
Published : Mar 05, 2022, 06:06 PM IST
ఏపీ మూడు రాజధానులు : హైకోర్టు తీర్పుపై ధర్మాన అసహనం, అసెంబ్లీలో చర్చించాల్సిందే.. జగన్‌కు లేఖ

సారాంశం

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోందని ధర్మాన అన్నారు  

రాజధాని మార్చేందుకు కానీ, రెండు, మూడు రాజధానులుగా విభజించుటకు శాసనాధికారం లేదంటూ ఏపీ హైకోర్టు తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు (dharmana prasada rao) . శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన శనివారం లేఖ రాశారు. రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని ప్రసాదరావు లేఖలో వివరించారు. శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని.. దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. హైకోర్టు తీర్పులో శాసనసభ అధికారాలలోనూ, బాధ్యత నిర్వహణలోను న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోందని ధర్మాన అన్నారు. 

మరోవైపు.. అమరావతే రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించనున్నట్లు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy) తెలిపారు. రాజధాని అంశాన్ని చర్చించే విషయమై బీఏసీలో నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధాని మార్చడం, మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న దానిపై చర్చిస్తామని శ్రీకాంత్  రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ హక్కులపై చర్చించాలని శాసన సభ్యులు కోరుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ధర్మాన లేఖఫైన బీఏసీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం.. సభకు చట్టాలు చేసే హక్కు లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చట్టం చేయడం శాసనసభకు సంక్రమించిన హక్కు అని ధర్మాన చెప్పారు. అసెంబ్లీ, న్యాయ, కార్యనిర్వహక బాధ్యతలపై చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే.. అమ‌రావ‌తిలోనే (amaravathi) ఏపీ రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని హైకోర్టు (ap high court) తీర్పు చెప్పిన నేప‌థ్యంలో మ‌రోమారు ఏపీ రాజ‌ధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (botsa satyanarayana) . శ‌నివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. త‌మ ప్ర‌భుత్వ వైఖ‌రిని మరోమారు తేల్చిచెప్పారు. ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉందన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తో (ap three capitals) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స పేర్కొన్నారు. 

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని ఎక్క‌డ నిర్మించాల‌నే విష‌యంపై కేంద్రం నియ‌మించిన జ‌స్టిస్ శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ (sivaramakrishnan committee) కూడా పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌ను ప్ర‌స్తావించింద‌ని మంత్రి గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ.. శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ సిఫారుల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ అధినేత ఆలోచ‌న‌లే త‌మ‌కు శిరోధార్యం అని చెప్పిన ఆయన.. టీడీపీ (tdp) నేత‌లు చెప్పిన మాట‌ల‌ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌ని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అంశంపై కూడా ఆలోచిస్తున్నామని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పునర్విభజనపై వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Speech: దావోస్‌ పర్యటనలో జగన్ పై చంద్రబాబు పంచ్ లు| Asianet News Telugu