అభివృద్ది అంతా ఒకే ప్రాంతంలో ... చంద్రబాబు ఎప్పుడూ అంతే : భూమన కరుణాకర్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 15, 2022, 5:25 PM IST
Highlights

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వున్నా ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే చూస్తారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీడీపీ, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా జగన్ చర్యలపై విష ప్రచారం చేస్తున్నాయని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. 
 

సీఎం జగన్ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారని ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి . అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఒక ప్రాంతంలోనే అభివృద్ధి చేయాలని చూశారని ఆరోపించారు. జగన్ చిత్తశుద్ధితో వికేంద్రీకరణ ప్రతిపాదన తీసుకొచ్చారని .. తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్న ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు భూమన. టీడీపీ, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియా జగన్ చర్యలపై విష ప్రచారం చేస్తున్నాయని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. 

రాయలసీమ, నెల్లూరు ప్రజలకు అప్పటి మద్రాస్ నగరంతో భావోద్వేగ అనుబంధం వుందని ఆయన గుర్తుచేశారు. కానీ ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు రాయలసీమ ప్రజలు నష్టపోతూనే వున్నారని కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎం అయ్యాక సీమ అభివృద్ధికి పాటుపడ్డారని, కానీ చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనల మధ్య వ్యత్యాసం వుందని కరుణాకర్ రెడ్డి తెలపారు. కానీ తెలుగువాళ్లుగా అందరం కలిసే వుండాలని.. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే జగన్ ఆకాంక్ష అని భూమన స్పష్టం చేశారు. 

Latest Videos

ఇకపోతే.. అభివృద్ది చేయని, చేయలేని ప్రాంతంలో చంద్రబాబు  అమరావతిలో ఉద్యమాలు చేయిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అమరావతిలో రకరకాల డ్రామాలు జరుగుతున్నాయన్నారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. హైద్రాబాద్ కంటే కూడా కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పదని సీఎం ఎద్దేవాచేశారు. 

ALso REad:వెయ్యి రోజులుగా అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు: ఏపీ అసెంబ్లీలో జగన్

వీళ్ల దృష్టిలో మాత్రమే అమరావతి ఎందుకు గొప్పదనే దానిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఎవరి అభివృద్ది కోసం వీరంతా ఉద్యమాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ ,పేద ఓసీల కోసం ఉద్యమం చేస్తున్నారా అని సీఎం అడిగారు. పెత్తందారుల స్వంత అభివృద్ది కోసమే ఉద్యమాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల  ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా డ్రామా నడుపుతున్నారన్నారు.

2019లో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు సమానంగా ఉందన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ ఎందుకు ఎందుకు ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో అనే పద్దతి ఉందన్నారు. 
 

click me!