పరిషత్ ఎన్నికల బహిష్కరణ: ఆడలేక మద్దెలదరువన్నట్లుగా వుంది.. చంద్రబాబుపై అంబటి సెటైర్లు

By Siva KodatiFirst Published Apr 2, 2021, 6:01 PM IST
Highlights

ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను  ప్రారంభిస్తే ఎందుకిత బాధ అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, రమేశ్ కుమార్ రాసిన లేఖను చదివి వినిపించారంటూ ఎద్దేవా చేశారు. 

ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను  ప్రారంభిస్తే ఎందుకిత బాధ అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, రమేశ్ కుమార్ రాసిన లేఖను చదివి వినిపించారంటూ ఎద్దేవా చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకున్నారని.. మున్సిపల్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయారంటూ అంబటి ధ్వజమెత్తారు. రమేశ్ కుమార్ ఉన్నప్పుడు మీకు అనుకూలంగా జరుగుతాయనే ఎన్నికల్ని బహిష్కరించలేదంటూ రాంబాబు ఆరోపించారు.

ఇప్పుడు ఓడిపోతామనే భయంతోనే పారిపోతున్నారని అంబటి సెటైర్లు వేశారు. తిరిగి తమపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని... టీడీపీ జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, ఆయన కొడుక్కి టీడీపీని బతికించే సత్తా లేదని రాంబాబు జోస్యం చెప్పారు. తండ్రీకొడుకులు టీడీపీ బండిని ముంచేసే పరిస్ధితికి తీసుకొచ్చారని.. లోకేశ్‌కు పొట్టకోస్తే అక్షరం ముక్కరాదని అంబటి ఎద్దేవా చేశారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు నమ్మకం వుందా అని రాంబాబు ప్రశ్నించారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాలేడని.. చంద్రబాబు వెన్నుపోటుతో రాజ్యాధికారంలోకి వచ్చాడని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదని.. రేపు అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా అభ్యర్ధులు దొరకరని రాంబాబు జోస్యం చెప్పారు. చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారని.. నిమ్మగడ్డ మీద నమ్మకంతోనే చంద్రబాబు మొన్న పోటీ చేశారని ఆయన చెప్పారు.

చంద్రబాబుకు రాద్ధాంతం తప్ప.. సిద్ధాంతం లేదని ఎస్ఈసీ సమావేశాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించాయని అంబటి తెలిపారు. ఆనాడు నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని.. ఆ పార్టీలు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని రాంబాబు నిలదీశారు. చంద్రబాబు ఆత్మబంధువులంతా ఒకేలా మాట్లాడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. 

click me!