
జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికలపై సీఎం, మంత్రులు ముందు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహిస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు.
పరిషత్ ఎన్నికలపై గవర్నర్‌కు మాజీ ఎస్ఈసీ లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని.. రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోకుండా నోటిఫికేషన్ ప్రకటించారని చంద్రబాబు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకున్నారని ప్రతిపక్షనేపత ఆరోపించారు.
పెన్షన్లు, రేషన్లు, అమ్మఒడి, రైతు భరోసా రావని ఓటర్లను బెదిరించారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2014లో రెండు శాతం ఏకగ్రీవమవ్వగా.. 2020లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ పెయిర్ ఎన్నికలు జరగాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్‌గా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు.
2014లో 1 శాతం లోపు జడ్‌పీటీసీలు ఏకగ్రీవం కాగా.. ఇప్పుడు 19 శాతం ఏకగ్రీవమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. గత షెడ్యూల్ కొనసాగిస్తున్న ఎస్ఈసీ దీనికి ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగిన ఎన్నికలను కొనసాగిస్తున్నారని.. బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.