
భారతదేశంలో సినీతారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను ప్రజలు దేవుళ్లులాగా పూజిస్తారు. వారిని అనుకరించడం.. తమ అభిమాన నేతను ఎవరైనా ఒక్క మాటంటే సోషల్ మీడియాలో విరుచుకుపడటం చేస్తుంటారు.
అంతేనా జీవితంలో వారిని ఒక్కసారైనా కలవాలని.. ఫోటో దిగి పదిలంగా వుంచుకోవాలని భావించే వారు ఎందరో వున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి 11 ఏళ్లుగా చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. ఎండైనా, వానైనా.. రోడ్డు సెగలు కక్కుతున్నా అతను మాత్రం చెప్పులు వేసుకోడు. వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల ఖాశీంకు వైఎస్ జగన్ అంటే ఎంతో ఇష్టం. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో కర్నూలు జిల్లాకు వచ్చిన జగన్‌ను కలిశాడు.
జగన్ సీఎం అవ్వాలని.. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ జగన్‌ను కలిసేంత వరకూ కాళ్లకు చెప్పులు ధరించనని స్నేహితులు, గ్రామస్తులందరి సమక్షంలో శపథం చేశాను. దీనిలో భాగంగా గడిచిన 11 ఏళ్లుగా పాదరక్షలు లేకుండానే నడుస్తున్నాడు.
అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో జగన్ దగ్గరకు తీసుకెళ్లాలని నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డిని కలిశాడు.
ఆయన సీఎం దగ్గరకు తీసుకెళతానని చెప్పారు. అయితే దీనిపై కాలయాపన జరగడంతో గ్రామస్తులు వచ్చి ఎమ్మెల్యేను కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిందాకా ఖాశీం చెప్పులు వేసుకునేలా కనిపించడం లేదని, ఆయనను త్వరగా జగన్ దగ్గరకు తీసుకెళ్లాలంటూ విజ్ఞప్తి చేశారు.