టార్గెట్ అచ్చెన్న .. వ్యూహాత్మకంగా జగన్, టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడ వాణి..?

By Siva KodatiFirst Published May 26, 2023, 2:36 PM IST
Highlights

తమకు కొరకరాని కొయ్యగా మారిన అచ్చెన్నాయుడిని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈసారి గట్టిగా టార్గెట్ చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడ వాణిని ప్రకటించే అవకాశం వుంది. 
 

ప్రతిపక్ష టీడీపీలోని కీలక నేతల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత వైసీపీ అధిష్టానం టార్గెట్ చేసే ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు. దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు కుటుంబానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్నారు అచ్చెన్నాయుడు. తొలి నుంచి ఆ కుటుంబంతో వున్న అనుబంధం కారణంగా చంద్రబాబు అధికారంలో వున్నా లేకపోయినా కింజారపు ఫ్యామిలీకి ప్రాధాన్యతను ఇస్తూనే వున్నారు. స్వయంగా తన కుటుంబం కంటే ఎక్కువ టికెట్లు వారికే కేటాయించారు చంద్రబాబు. అచ్చెన్నాయుడుకి ఎమ్మెల్యే, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడికి ఎంపీ, ఎర్రన్న కుమార్తె ఆదిరెడ్డి భవానీకి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు. అందుకు తగినట్లుగానే వీరు టీడీపీపై, చంద్రబాబుపై ఈగ వాలనివ్వరు. 

అయితే తమకు కొరకరాని కొయ్యగా మారిన అచ్చెన్నాయుడిని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈసారి గట్టిగా టార్గెట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి 2014, 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు వరుసగా గెలిచారు. ప్రస్తుతం హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే కావడంతో అచ్చెన్నపై ప్రజల్లోనూ కాస్త అసంతృప్తి వుంది. ఈ నేపథ్యంలో ఈసారి అచ్చెన్నాయుడిని ఎలాగైనా ఓడించాలని భావించిన జగన్.. అక్కడ అన్ని రకాలుగా బలవంతుడైన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి టికెట్ గ్యారెంటీ అని ప్రకటించారు. ఇప్పటికే దువ్వాడ అక్కడ ఇన్‌ఛార్జ్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. 

అయితే ఆయన సతీమణి దువ్వాడ వాణిని ఇక్కడ బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం టెక్కలి జడ్పీటీసీగా వున్న ఆమె గతంలో శ్రీకాకుళం జిల్లా జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా నేత కావడంతో వాణి కారణంగా వైసీపీకి కొంత అడ్వాంటేజ్ వుంటుందని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వాణి అభ్యర్ధిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!