మండలిలోనూ వైసిపిదే పైచేయి... ఇక ఎవ్వరూ ఆపలేరు: సజ్జల

By Arun Kumar PFirst Published Mar 4, 2021, 4:53 PM IST
Highlights

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.  

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డిని ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. ఈ ఆరుగురు అభ్యర్థులకు సీఎం బీ- ఫామ్ ఇచ్చారు. ఇలా జగన్ చేతులమీదుగా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇక్బాల్, కరీమున్సీసా, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య కలిశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.  

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోందన్నారు. పార్టీ కోసం ముందు నుంచి నిలబడిన వారిని గుర్తించి సమపాళ్లలో సముచిత స్థానాలు ఇవ్వటం వల్లనే ఎక్కడా చిన్నపాటి సమస్య కూడా ఉండటం లేదన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని పార్టీలో అందరూ గుర్తించాలని సూచించారు.

read more   36కేసుల కోసం 32మంది ప్రాణత్యాగం ఫణంగా...: అచ్చెన్నాయుడు ఆగ్రహం

మిగిలిన పార్టీల్లో మాదిరిగా.. రాజకీయ సంస్కృతిలో భాగంగా ఉండే ఊహాగానాలు, అసంతృప్తులు వంటివి వైఎస్సార్‌సీపీలో కనిపించవని తెలిపారు. ఇది జగన్ నాయకత్వ ప్రతిభకు, సమన్యాయం అందించటంలో చూపిస్తున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలబడుతుందన్నారు. 

''అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్న తర్వాత కౌన్సిల్‌లో ఉన్న మందబలాన్ని ఆసరాగా చేసుకొని, సాంకేతిక కారణాలు చూపి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే పనులు చేయటాన్ని ప్రజలంతా గమనించారు. వాటికి కూడా ప్రజలు చరమగీతం పాడారు. వచ్చే మేతో వైయస్‌ఆర్‌సీపీకి కౌన్సిల్‌లో మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి జగన్ చేసే చర్యలకు ఉభయ సభలూ మద్దతు ఇవ్వటంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఊపు అందుకుంటాయి. సమీప భవిష్యత్‌లో అదీ పూర్తి అవుతుంది'' అన్నారు.  

 

click me!