ఈ నెల 26 నుండి వైఎస్ఆర్‌సీపీ బస్సు యాత్ర ను నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
విశాఖపట్టణం: ఈ నెల 26న ఇచ్ఛాపురంలో సామాజిక సాధికారిత బస్సుయాత్ర ప్రారంభం కానున్నందని వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఆదివారంనాడు విశాఖపట్టణంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
నాలుగున్నర ఏళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో ప్రజలకు ఏ రకమైన పథకాలు అందాయనే విషయాన్ని బస్సు యాత్ర ద్వారా వివరించనున్నట్టుగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని ఇచ్చాపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.ఈ నెల 27న గజపతినగరంలో, ఈ నెల 28న భీమిలీ, 30న పాడేరు, నవంబర్ 1న పార్వతీపురం,నవంబర్ 2న మాడ్గుల,నవంబర్ 3న పలాస, నవంబర్ 4న శృంగవరపుకోట, నవంబర్ 6న గాజువాక, నవంబర్ 7న ఆముదాలవలస, నవంబర్ 8న సాలూరు,నవంబర్ 9న అనకాపల్లితో తొలి దశ సామాజిక బస్సు యాత్ర ముగియనుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
దీపావళి పర్వదినం తర్వాత రెండో దశ షెడ్యూల్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. దళితులకు, గిరిజనులకు సీఎం జగన్ చేసిన మేలు గతంలో ఎవ్వరూ కూడ చేయలేదన్నారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్‌సీపీ వెళ్తుంది. తమ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన విషయాన్ని బస్సు యాత్రలో వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరించనున్నారు. ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ సర్కార్ చేపట్టిన విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టాలని సూచించారు.ఈ క్రమంలోనే బస్సు యాత్రకు ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టనున్నారు.