పూర్తిగా కనుమరుగైంది.. టీడీపీని జాకీలు పెట్టి లేపుతున్నారు: సజ్జల

By Siva KodatiFirst Published Feb 14, 2021, 6:47 PM IST
Highlights

రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించామన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2,640 మంది వైసీపీ మద్ధతుదారులు విజయం సాధించారని తెలిపారు.

రెండో విడత ఎన్నికల్లో కూడా 80 శాతం విజయం సాధించామన్నారు వైసీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2,640 మంది వైసీపీ మద్ధతుదారులు విజయం సాధించారని తెలిపారు.

మేం ఊహించిన విధంగానే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఫేక్‌ వెబ్‌సైట్‌తో ప్రజల్ని మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

538 మంది టీడీపీ మద్ధతుదారులు గెలిచారని సజ్జల తెలిపారు. ప్రజల తీర్పును తెలుగుదేశం పార్టీ వక్రీకరిస్తోందని... మా వాళ్ల వివరాలన్నీ ఆధారాలతో సహా వెబ్‌సైట్‌లో వుంచామని ఆయన వెల్లడించారు.

వైసీపీ మద్ధతుదారుల ఫోటోలు వెబ్‌సైట్‌లో పెట్టామని.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు ఎవరిని భ్రమల్లో వుంచాలని అనుకుంటున్నారో తెలియడం లేదన్నారు.

సీఎం జగన్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే ఇందుకు ఉదాహరణ అన్నారు. సాక్షాత్తూ చంద్రబాబు తీసుకువచ్చిన ఎస్ఈసీని ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెబుతున్నారని సజ్జల పేర్కొన్నారు.

వచ్చే రెండు దశల్లో కూడా ఇదే స్థాయి ఫలితాలు ఉంటాయని.. మరో 30 ఏళ్లు జగన్ పాలనే కావాలని జనం భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ గుర్తులతో జరగనున్న రానున్న ఎన్నికల్లో.. బుకాయించడానికి బాబుకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.  పడిపోయిన టీడీపీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారని.. ఓటమిని కూడా సెలబ్రెట్ చేసుకుంటున్న నేత బాబు ఒక్కరేనని సజ్జల సెటైర్లు వేశారు.

ఈ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందని.. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోకూడదని భ్రమలో పెట్టాలనే చంద్రబాబు ఉద్దేశమన్నారు. జనం అప్‌డేట్ అయినా.. చంద్రబాబు అప్‌డేట్ కాలేదని సజ్జల ఎద్దేవా చేశారు. 
 

click me!