పంచాయతీ ఎన్నికలు: అవకతవకలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Feb 14, 2021, 5:52 PM IST
Highlights

పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆదివారం ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ.. అధికార పార్టీలో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు

పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆదివారం ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ.. అధికార పార్టీలో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

టీడీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ చేసి వైసీపీని విజేతగా ప్రకటించారని రాజా వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్ వెనుక పోలింగ్ బూత్ స్టాంప్ వున్న వాటిని పక్కన పెట్టారని రాజా పేర్కొన్నారు.

ఆ స్టాంప్ బయటివారి చేతికి ఎలా వచ్చిందని ఆయన నిలదీశారు. ఎస్ఈసీ ఉత్తర్వులను అధికారులు పట్టించుకునే పరిస్ధితి లేదని ఆలపాటి రాజా విమర్శించారు.

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. టీడీపీ చొరవ వల్లే 82 శాతం ఓట్లు పోల్ అయ్యాయని చంద్రబాబు గుర్తుచేశారు. 4 గంటల నుంచి 10 గంటల వరకు టీడీపీ ప్రభంజనం కనిపించిందని.. ఆ తర్వాత నుంచి చీకటి రాజ్యం ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ చేయించారని.. తాము అడిగితే రీకౌంటింగ్‌కు అంగీకరించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని అవకతవకలు చేశారని ప్రతిపక్షనేత మండిపడ్డారు.

కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని... రాత్రిపూట ఎందుకు ఓట్ల లెక్కింపు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అలాంగే కౌంటింగ్ కేంద్రాల్లో రాత్రిళ్లు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ఆయన నిలదీశారు.  

click me!