
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనంటూ ఎద్దేవా చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడలేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా అబద్ధాలేనని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చిందని రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు.
టీడీపీ అధినేతలో ఇప్పుడు కొత్తగా నిస్పృహ కనిపిస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఛీత్కరించారని.. ఆయన తనయుడికి ప్రజాక్షేత్రంలో పోటీ చేసే సత్తా లేదని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ గెలిస్తే అక్రమాలని గగ్గోలు పెడతారని.. చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్య ఓటమి అంటారంటూ సజ్జల సెటైర్లు వేశారు. ఏపీలో సంక్షేమ పాలన నడుస్తోందని.. గడప గడపకు సంక్షేమ ఫలాలను అందజేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
కుప్పంలో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. సీఎం జగన్ బాధ్యతగా హామీలను అమలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సహనం కోల్పోయిన చంద్రబాబు.. ఎన్నికల ఫలితాలపై దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.