దస్తగిరికి ఫుల్ పబ్లిసిటీ , పథకం ప్రకారమే అరెస్ట్‌లు.. చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు : సజ్జల

By Siva KodatiFirst Published Apr 18, 2023, 7:11 PM IST
Highlights

దుష్ప్రచారం కోసమే దస్తగిరితో ఎల్లో మీడియా, టీడీపీనే మాట్లాడించినట్లుగా వుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి బెయిల్ ఇప్పించింది ఎవరు అని సజ్జల ప్రశ్నించారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఎల్లో మీడియా కల్పితాలు ప్రచారం చేస్తోందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్జంటుగా చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టాలని ఎల్లో మీడియా తాపత్రయపడుతోందన్నారు. దీనిలో భాగంగానే దస్తగిరి మాటలను పతాక శీర్షికల్లో ప్రచురించారని సజ్జల మండిపడ్డారు. విపక్షాల పొలిటికల్ అజెండాలో భాగంగానే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. దస్తగిరిని ఆర్గనైజ్ చేసి మాట్లాడిస్తున్నారేమోనన్న అనుమానాన్ని సజ్జల వ్యక్తం చేశారు. 

రాబోయే ఎన్నికల కోసమే కథను సిద్ధం చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం కోసమే దస్తగిరితో ఎల్లో మీడియా, టీడీపీనే మాట్లాడించినట్లుగా వుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ అత్యంత నీచస్థాయికి దిగజారిపోయిందని.. తమ పాలనలో ఏం చేశామో చెప్పుకునే స్థితిలో టీడీపీ లేదన్నారు. కేసు దర్యాప్తు పూర్తయినట్లుగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పథకం ప్రకారమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. 

నాడు వైఎస్ఆర్‌పై ఇదే ప్రయోగం చేశారని.. మళ్లీ ఇప్పుడు జగన్‌పై అదే దాడి చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. దస్తగిరి లాంటి వ్యక్తి మాటలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని.. స్టేట్‌మెంట్లు తీసుకోవడం తప్పించి సీబీఐ దర్యాప్తు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. దర్యాప్తు పేరుతో డ్రామాలు చేస్తున్నారని సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జగన్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని.. జగన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఈ నాటకాలు ఆడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

టార్గెట్ చేస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారని.. కీలక విషయాలను పట్టించుకోలేదనే దర్యాప్తు బృందాన్ని మార్చారని ఆయన గుర్తుచేశారు. కొత్త బృందం ఒక్క ఆధారాన్ని అయినా సేకరించిందా అని సజ్జల ప్రశ్నించారు. ఎల్లో మీడియా యథేచ్చగా ట్రయల్ చేస్తోందని.. వాళ్లకే అధికారం వుంటే తీర్పు కూడా ఇచ్చేవారేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు. కొంతకాలం ఇబ్బంది పెడతారేమో కానీ.. చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి బెయిల్ ఇప్పించింది ఎవరు అని సజ్జల ప్రశ్నించారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందని టీడీపీ దురాశ అంటూ ఆయన ఆరోపించారు. 

ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు

ఊహాజనితంగా తాము ప్రశ్నించడం లేదని.. కేసు తేలని సమయంలోనే అప్రూవర్‌గా మారుస్తారని సజ్జల పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న మాటలను ఎందుకు పట్టించుకోవడం లేదని రామకృష్ణా రెడ్డి నిలదీశారు. ప్రత్యక్ష సాక్షి వుండగా అప్రూవర్‌తో పనేంటి అని ఆయన ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా వున్నాయని.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలపై నేరం మోపాలని ముందుగానే నిర్ణయించారని సజ్జల ఆరోపించారు. 

ఇష్టానుసారం సీబీఐ పేర్లు చేరుస్తుంటే.. ఎల్లో మీడియా ప్రింట్లు ఇస్తోందన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై కేసులు నిలబడవని సజ్జల పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో జరుగుతోన్న తతంగాన్ని ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలోనే భాగాంగా ఇదంతా నడుస్తోందని ఆయన ఆరోపించారు. వివేకా కేసును రాజకీయాల కోసం వాడుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారనే తమ బాధ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!