
న్యూడిల్లీ : మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మొత్తం డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని మార్గదర్శి సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు గుట్టుగా వుంచిన మార్గదర్శిలో డిపాజిట్లు, పెట్టుబడులు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడనున్నాయి.
సుప్రీం కోర్టులో జరిగిన విచారణపై ఉండవల్లి స్పందించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయంటే గత 17 ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటంలో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుందని అన్నారు. కొన్నేళ్లుగా డిపాజిటర్ల వివరాలు బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారు? రూ.2,600 కోట్ల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయి..?
డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు..? చెక్కుల రూపంలో ఇచ్చారా..? మరో రూపంలో ఇచ్చారా..? అని మార్గదర్శి సంస్థను న్యాయస్థానం ప్రశ్నించిందని అన్నారు.
Read More కేవలం కర్రలే కాదు బుర్రలు కూడా వాడండి..: సిఐడి అధికారులకు న్యాయవాది చురకలు
డిపాజిటర్ల వివరాలను తమకు అందజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జే.బీ.పర్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం మార్గదర్శి యాజమాన్యాన్ని ఆదేశించిందని ఉండవల్లి పేర్కొన్నారు. డిపాజిటర్లు అందరికీ చెల్లింపులు చేసామని మార్గదర్శి తరపు న్యాయవాది తెలిపారు. వారి వివరాలు బయటపెట్టడానికి అభ్యంతరం ఏమిటని ఉండవల్లి ప్రశ్నించారు. దీంతో న్యాయస్థానం కూడా పిటిషనర్ వాదనతో ఏకీభవించి వివరాలు వెల్లడించాలని మార్గదర్శి సంస్థను కోరింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ ను ఒకచోట HUF (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ), మరోచోట ప్రొప్రైటరీ కన్సర్న్ అని పేర్కొనడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నింటీకి సమాధానం చెప్పాలని ఉండవల్లి మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యాన్ని కోరారు.