రింగ్ రోడ్డు వేసుంటే.. ఆ కాంట్రాక్ట్ కూడా దోచుకునేవాళ్లు, అసలు అమరావతే ఓ కుట్ర : సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva Kodati  |  First Published Oct 11, 2023, 2:55 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని సజ్జల ఆరోపించారు. లేని ప్రాజెక్ట్‌లు వున్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ అయ్యారని రామకృష్ణారెడ్డి తెలిపారు. 

చంద్రబాబు అరెస్ట్‌లో కక్ష సాధింపు ఎక్కడ వుంది అని సజ్జల ప్రశ్నించారు. రూ.300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. సీమెన్స్ సైతం తమకు సంబంధం లేదని చెప్పిందని.. ఫేక్ ఇన్వాయిస్‌లతో నిధులు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అవసరమైతే సాక్ష్యులను దేశం దాటించగలరని రుజువైందని సజ్జల ఎద్దేవా చేశారు. 

Latest Videos

చంద్రబాబు బయటవుంటే మొత్తం తారుమారు చేయగలరన్న ఉద్దేశంతోనే సీఐడీ ఆయనను అరెస్ట్ చేసి వుండొచ్చని రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ స్కాంలో సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారుడని ఆయన ఆరోపించారు. నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారని సజ్జల తెలిపారు. లేని ప్రాజెక్ట్‌ను ఉన్నట్లుగా చూపించి ప్రజల సొమ్మును దోచేశారని ఆయన ఆరోపించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తులు చంద్రబాబు సంపాదించారని అందరికీ తెలుసునని సజ్జల చెప్పారు. 

చంద్రబాబు లాయర్లు ఒకే పాయింట్ మీద వాదిస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని సజ్జల ఆరోపించారు. ఈ కేసులో ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసిందని ఆయన వెల్లడించారు. సుదీర్ఘకాలం దర్యాప్తు జరిగాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని.. కోర్టు కూడా నమ్మింది కాబట్టే రిమాండ్‌కు పంపిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఐటీ శాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారని , జాకీలు పెట్టి లేపినా టీడీపీ లేవదని ఆయన జోస్యం చెప్పారు. 

సొంతపార్టీ నేతలే టీడీపీని పట్టించుకోవడం లేదని.. చంద్రబాబు కొడుకే వెళ్లి ఢిల్లీలో కూర్చున్నాడని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకు వచ్చారని.. లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో అర్ధం కావడం లేదన్నారు. రూ.300 కోట్ల ప్రజాధనాన్ని జేబులో వేసుకోవడానికి స్కిల్ కుట్రకు తెరదీశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసలు అమరావతి అంతా కుట్రేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని.. తప్పు చేశారు కాబట్టే , టీడీపీ నేతలు మొహం చాటేశారని సజ్జల దుయ్యబట్టారు. రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను పక్కకు జరిపింది నిజం కాదా .. అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. లేని ప్రాజెక్ట్‌లు వున్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రోడ్డు వేసి వుంటే ఆ కాంట్రాక్ట్ కూడా దోచుకునేవాళ్లని ఆయన ఆరోపించారు. 

click me!