కుప్పం చేయిదాటిపోయిందని అర్ధమైనట్లుంది.. అప్పుడు ఏం చేసినట్లు : చంద్రబాబుపై సజ్జల విమర్శలు

By Siva KodatiFirst Published Sep 2, 2022, 6:29 PM IST
Highlights

కుప్పం చేయిదాటిపోయిందని చంద్రబాబుకు అర్ధమైనట్లుందని సెటైర్లు వేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఏనాడూ చేయడని.. నెల్లూరు జంట హత్యలను సైతం తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం కూడా చేయిదాటిపోయిందనే విషయం ఇప్పుడు చంద్రబాబుకు అర్ధమైందంటూ చురకలు వేశారు. అధికారం ఇస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్‌ని తవ్విస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నారని.. మరి అధికారంలో వున్నప్పుడు ఈ పని ఎందుకు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో గుర్తుండే పని ఒక్కటైనా వుందా అంటూ రామకృష్ణారెడ్డి నిలదీశారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ.. జగన్ హయాంలో కానీ వందల సంఖ్యలో పథకాలను అమలు చేశామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎల్లో మీడియా సృష్టించిన వ్యక్తని... ఇప్పుడు సోషల్ మీడియా సహకారంతో మరింత రెచ్చిపోతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు ఏనాడూ చేయడని.. నెల్లూరు జంట హత్యలను సైతం తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీలు ఎంతోమంది జీవితాలను నాశనం చేసిందన్నారు. 

Latest Videos

అంతకుముందు గత వారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పీకేశారని ఆరోపించారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుగా తిరిగి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబువి దరిద్రపు ఆలోచనలని.. పేదవాళ్లకి సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే బాబు లక్ష్యమని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదల ఆకలి నిజంగా తీర్చాలనుకుంటే.. అన్న క్యాంటీన్‌ను 2014లోనే ఎందుకు ఏర్పాటు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. 

ALso Read:చొక్కాలు చించుకున్నా నో యూజ్... కుప్పం ఘటనలో చంద్రబాబే ముద్ధాయి : సజ్జల రామకృష్ణారెడ్డి

నిన్నటి నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన అంతా డ్రామా లా జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. గొడవ చేసింది వాళ్ళే.. వీరంగం చేసింది వాళ్ళే.. మళ్ళీ వైసీపీని పోలీసులను అంటున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు శాంతియతంగా నిరసన తెలియజేశారని.. 30 ఏళ్లుగా కుప్పాన్ని చంద్రబాబు ఉక్కుపాదాల కింద నొక్కి పెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారని సజ్జల పేర్కొన్నారు. 

30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని తాము మూడేళ్లలో చేశామని, కుప్పం ప్రజలు చంద్రబాబు వల్ల విసిగిపోయారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇకపై కుప్పంలో చంద్రబాబుకి స్థానం లేదని తెలిసిపోయిందని, అందుకే రిజెక్ట్ చేసేశారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇకపై చంద్రబాబు చొక్కాలు విప్పుకుని అరిచినా ఉపయోగం లేదని, ఇన్ని రోజులు కుప్పం ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు ఈరోజు ఆఫీస్ ప్రారంభించారని ఆయన సెటైర్లు వేశారు. 

click me!