భవిష్యత్ లో కాంగ్రెస్ లో టీడీపీ విలీనం

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 6:39 PM IST
Highlights

చంద్రబాబు నాయుడు వేషాలు తెలుసు కాబట్టే కామ్రేడ్లు ఢిల్లీకి వెళ్లలేదన్నారు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీల కలయిక పొలిటికల్ కంపల్షన్ కాదని ఫైనాన్షియల్ కంపెల్షన్ మాత్రమేనని ఆరోపించారు. 

హైదరాబాద్: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ధర్మపోరాట దీక్షపై వైసీపీ రాష్ట్ర ప్ఱధాన కార్యదర్శి సి రామచంద్రయ్య సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు దీక్ష పార్టీ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. 

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు దీక్ష కొయ్యగుర్రంపై స్వారీ చేసినట్లుందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ముతో ఢిల్లీలో దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని విరుచుకుపడ్డారు. 

రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా కోట్లాది రూపాయలతో ఢిల్లీలో దీక్షల పేరుతో డ్రామాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజల సొమ్మును వినియోగించడాన్ని ఆయన తప్పుబట్టారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రిచ్ గా ఉందని ఆ సొమ్మును వాడుకోవచ్చుకదా అంటూ హితవు పలికారు. చంద్రబాబు నాయుడు ఏఐసీసీ కోశాధికారిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చులు చంద్రబాబే ఇచ్చారని, నార్త్ ఇండియా ప్రచారానికి వెళ్లకుండానే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి తన కృషి ఉందని చెప్పుకున్నారని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు రక్తంలో 30శాతం కాంగ్రెస్ రక్తం ఉందన్నారు. చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నీచంగా తిట్టారని, రాహుల్ తల్లిని, వంశాన్ని కూడా వదల్లేదన్నారు. అదే రాహుల్ గాంధీ చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటే వీళ్లకు పౌరుషం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. 

చంద్రబాబు నాయుడు వేషాలు తెలుసు కాబట్టే కామ్రేడ్లు ఢిల్లీకి వెళ్లలేదన్నారు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీల కలయిక పొలిటికల్ కంపల్షన్ కాదని ఫైనాన్షియల్ కంపెల్షన్ మాత్రమేనని ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు హడావిడి చూస్తుంటే భవిష్యత్ లో టీడీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నారు. చంద్రబాబు నాయుడు దీక్షకు వచ్చిన వారంతా చంద్రబాబు కోసం రాలేదని మోదీపై వ్యతిరేకతతో మాత్రమే హాజరయ్యారని చెప్పుకొచ్చారు సి.రామచంద్రయ్య.  

click me!