చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసిపి నేత కోలగట్ల

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 6:18 PM IST
Highlights

చంద్రబాబు కంటే ముందే తాము ఢిల్లీలో దీక్షలు చేశామని, ఉద్యమాలు చేశామని అవి కూడా టీడీపీ కాపీ కొడుతుందంటూ విరుచుకుపడ్డారు. తాము సొంత డబ్బులతో ఢిల్లీలో దీక్షకు వెళ్తే చంద్రబాబు నాయుడు మాత్రం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీక్షలు చేశారంటూ ధ్వజమెత్తారు. 

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తపన, ఆరాటం అధికారం కోసమేనని ఆరోపించారు. 

విజయనగరం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన కోలగట్ల 2019 ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు నైతిక విలువలను గాలికి వదిలేశారని నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చారని ఆరోపించారు. 

ప్రత్యేక హోదా కోసం తానే కష్టపడుతున్నాను అన్నట్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీ ధర్మపోరాట దీక్షలో బిల్డప్ లు ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు మొరిగినట్టు ఆర్నెళ్ల ముందు ప్రత్యేక హోదా రాగం అందుకున్నారన్నారు. 

2014 నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేశారని ప్రజలు ఆ పోరాటాలను మరచిపోలేదన్నారు. 2015 ఆగస్టు 9 న ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ శ్రేణులు అంతా సొంత డబ్బులతో ఢిల్లీలో నిరసన దీక్ష చేశామని గుర్తు చేశారు. 

చంద్రబాబు కంటే ముందే తాము ఢిల్లీలో దీక్షలు చేశామని, ఉద్యమాలు చేశామని అవి కూడా టీడీపీ కాపీ కొడుతుందంటూ విరుచుకుపడ్డారు. తాము సొంత డబ్బులతో ఢిల్లీలో దీక్షకు వెళ్తే చంద్రబాబు నాయుడు మాత్రం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీక్షలు చేశారంటూ ధ్వజమెత్తారు. 

ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఎన్నికల ముందు మరోసారి ప్రజలను నమ్మించి వంచించేందుకు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, ప్రభుత్వ చెల్లింపులు ఆపివేసిన పరిస్థితిలో దీక్షల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. 

వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, తమతో కలసి రండి అని దేశం నేతలకు పిలుపునిస్తే ఆరోజు కలసి రాని వారు నేడు ఎవరిని వంచించడానికి దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేంద్రం ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం దొంగే దొంగ అని అరచినట్లు ఉందన్నారు. అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే తెచ్చినప్పుడు ప్రధానిని ఎందుకు హోదా అంశంపై ప్రశ్నించలేదన్నారు. 

అధికారం కోసం, పదవి వ్యామోహం కోసం నీతికి, జాతికి, నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయపడి చంద్రబాబు అమరావతికి వచ్చేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు జిమ్మిక్కులు, మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి. 

click me!