ఆ ఇద్దరితో రాహుల్ గాంధీకి చెక్ పెట్టాలని చంద్రబాబు ప్లాన్: ఆనం

By Nagaraju TFirst Published Dec 23, 2018, 12:21 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోవర్టులతో రాజకీయం చేసే వ్యక్తి అంటూ విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్లిద్దరూ చంద్రబాబు కోవర్టులంటూ ఆనం ఆరోపించారు. 
 

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోవర్టులతో రాజకీయం చేసే వ్యక్తి అంటూ విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్లిద్దరూ చంద్రబాబు కోవర్టులంటూ ఆనం ఆరోపించారు. 

కోవర్టుల ఇద్దరిని ఉపయోగించి రాహుల్ గాంధీని దెబ్బతియ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరి బంతి అన్న కిరన్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో తెలియదని కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా వచ్చేసి జగన్ విమర్శిస్తున్నాడని విరుచుకుపడ్డారు. జగన్ ను విమర్శించే స్థాయి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు. 

మరోవైపు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి 25 స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పే చంద్రబాబు ప్రస్తుతం ఉన్న 20 మంది ఎంపీలతో ఏం సాధించారని నిలదీశారు. నాలుగున్నరేళ్లు కేంద్రంలో కొనసాగి సాధించలేని విభజన హామీలను 25 మంది ఎంపీలు ఉంటే సాధిస్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కడప ఉక్కు కర్మాగారంను తామే సొంతంగా నిర్మించుకుంటామని చంద్రబాబు ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. స్థానిక టీడీపీ ఎంపీలకు చెందిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే సొంతంగా నిర్మిస్తామని అంటున్నారని ఆరోపించారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మరోసారి రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీల్లో భాగంగా కేం‍ద్రమే ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ఇదివరకే తెలిపిందని గుర్తు చేశారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే టీడీపీ కొత్తుకుట్రకు తెరలేపిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయంటున్న చంద్రబాబు మరి మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు. 

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి తప్పదని ఆ విషయం చంద్రబాబుకు తెలుసునన్నారు. ఓటమి భయంతోనే బాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతీ మీటింగ్‌లో అమరావతిని షాంగై, సింగపూర్‌ చేస్తామని చెప్తున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ల కాలంలో ఏమీ చేయలేకపోయారు అని విమర్శించారు. 

మరోవైపు తిరుపతిని సిలికాన్‌ సిటీగా పేరు మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం విరమించుకోవాలని లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. గతంలో వెయ్యికాళ్ల మండపంను నిర్మూలించిన తరువాత ఏం జరిగిందో చంద్రబాబుకు తెలుసునన్నారు. 
 

click me!