వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తన కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం నిఘా పెట్టిందని కోటంరెడ్డి ఆరోపణలు చేయడాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తన కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం నిఘా పెట్టిందని కోటంరెడ్డి ఆరోపణలు చేయడాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో వైసీపీ అధిష్టానం ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ వినుకొండ పర్యటనలో ఉండగా.. ఆయన తిరిగి తాడేపల్లి చేరుకున్నాక కోటంరెడ్డి వ్యవహారంపై వైసీపీ ముఖ్య నాయకులు ఓ నివేదికను అందజేసే అవకాశం ఉంది. అయితే కోటంరెడ్డిపై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇక, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర సంచనలంగా మారింది. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి.. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిచిన సీఎం జగన్.. ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కోటంరెడ్డి.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై తానెక్కడా విమర్శలు చేయలేదని చెప్పారు. అధికారుల నుంచి సహకారం లేదనే మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఈ పరిణామం తర్వాత అంతా సద్దుమణిగిందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారన్నారనీ.. ఈ విషయం తనకు ముందు నుంచే తెలుసని అన్నారు. రహస్యాలు మాట్లాడుకొనేందుకు తనకు వేరే ఫోన్ ఉందన్నారు. తన వద్ద 12 సిమ్ కార్డులున్నాయని చెప్పారు. ఫేస్ టైమర్ , టెలిగ్రాం కాల్స్‌ను పెగాసెస్ రికార్డు చేయలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన తనపై ఎందుకు నిఘా పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తనపై నిఘా కోసం ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని అని కామెంట్స్ చేశారు. అయితే కోటంరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.