దేవినేని ఉమపై దాడి... పోలీస్ బాసుగా మీ సమయమిదే: డిజిపికి చంద్రబాబు లేఖ

By Arun Kumar PFirst Published Jul 28, 2021, 10:32 AM IST
Highlights

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. . 

అమరావతి:  కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకుకేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుపై దాడిని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. ఈ దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు చంద్రబాబు. 

''ఆంధ్రప్రదేశ్ గత రెండేళ్ళలో మాఫియాకు, గూండాలకు, చట్టవిరుద్ధమైన అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇక్కడ రాజ్యాంగ హక్కులు కాలరాయబడి ప్రజాస్వామ్యం హననం చేయబడుతోంది. పాలక వైఎస్సార్ సిపి ఒక వర్గం పోలీసులతో కుమ్మక్కై అసమ్మతి స్వరాన్ని ప్రాణాభయంతో, అరెస్టులతో, బెదిరింపులతో దారుణంగా అణిచివేస్తుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావుపై, తెలుగుదేశం కార్యకర్తలపై జరిగిన దాడే తాజా ఉదాహరణ'' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

read more  దేవినేని ఉమా కారుపై రాళ్ల దాడి.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పనేనంటూ ఆరోపణలు

''ప్రజల నుండి అనేక ఫిర్యాదుల అందిన తరువాతే దేవినేని ఉమమహేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి మంగళవారం అనగా జూలై 27, 2021 న అక్రమ మైనింగ్ జరుగుతున్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని గడ్డమణుగూరు సందర్శించారు.వై.ఎస్.ఆర్.సి.పి గూండాలు జి. కొండురు మండలంలో దేవినేని ఉమ కారును చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఆయన కారుపై రాళ్ళు రువ్వి కారును ధ్వంసం చేశారు. కొంత మంది గాయాలపాలయ్యారు'' అని తెలిపారు. 

''స్థానిక ప్రజలు సమాచారం ఇచ్చిన తరువాత మాత్రమే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కనీసం ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతంలో ఇలాంటి అనాగరిక దాడి జరగడం గమనించదగినది. పోలీసులు చర్యలు తీసుకుని నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలి. పోలీసు అధిపతి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి, రాజ్యాంగ హక్కులను రక్షించడం చాలా ముఖ్యం'' అని డిజిపికి సూచించారు చంద్రబాబు. 
 

click me!