దేవినేని ఉమా కారుపై రాళ్ల దాడి.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పనేనంటూ ఆరోపణలు

By Siva KodatiFirst Published Jul 27, 2021, 10:18 PM IST
Highlights

టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడటంతో మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై కృష్ణా జిల్లాలో వైపీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే సమాచారం అందడంతో దేవినేని ఉమా వాటిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. పరిశీలన పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమైనట్టు సమాచారం. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. ఉమాపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.    

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఉమా వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న దేవినేని ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, వైసీపీ నేతల అక్రమాలపై పోరాడేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అయితే తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని ఆయన అన్నారు. తాను ఫోన్ చేసిన తర్వాతే వివాదం సద్దుమణిగిందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేయడానికే దేవినేని క్వారీ వద్దకు వెళ్లారంటూ ఆయన మండిపడ్డారు. 

click me!