వేయిసార్లు బల్లలెక్కుతాం, మైకులు విరుస్తాం...

First Published Oct 26, 2016, 9:42 AM IST
Highlights
  • ప్రత్యేక హోదా కోసం ఏమయిన చేస్తామంటున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్
  • ఎన్నిసార్లయినా బల్లెలక్కుతాం, మైకులు విరుస్తాం
  • ప్రివిలేజెస్ కమిటీ విచారణకు హాజరయిన వైఎస్ ఆర్ సి సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం బల్లలెక్కడమే కాదు, మైకులు లాగుతామని వైఎస్ఆర్ సి సభ్యులు పునరుద్ఘాటించారు. ఈ గొడవలే కాదు,  ఏమయినా చేస్తామని,  అవసరమయితే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత నెలలో అసెంబ్లీలో గొడవ చేసి,  మహిళా మార్షల్స్ ని తోసేశారనే అరోపణల మీద ప్రివిలేజెస్ కమిటీ  విచారణకు హాజరయిన అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ  ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను డిమాండ్ చేస్తూనే తాము అసెంబ్లీని స్తంభింప చేశామనిఆయన తెలిపారు. “రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాపై మా పోరాటం కొనసాగుతుంది.  అవసరం అయితే వందసార్లు బల్లలు ఎక్కుతాం, వెయ్యిసార్లు మైకు లాగుతాం,” అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

 

అధికార పక్షం బెదిరిస్తే బెదిరేది లేదని, తాము చేసిందంతా  ఎమ‍్మెల్యేలుగా ప్రజల ఆకాంక్షలనే సభలో వెల్లడించడమేనని అయన చెప్పారు.

 

"సభలో వాయిదా తీర్మానం  ఇచ్చాం. మాకు గాని మా నాయకునికి  గాని మాట్లాడే అవకాశం  ఇవ్వలేదు. అలాంటపుడు మాట్లాడే హక్కు కోసం మేం పోరాటం చేయవలసిచ్చింది. వర్షాకాల సమావేశాలలో మేం చేసిందంతా మా హక్కును గుర్తు చేశాం," ఈ నాయకులు చెప్పారు.

 

నేటి విచారణలో కమిటీ సభ్యులు అ రోజు సభలో జరిగిన గొడవలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను చూపించి,  ఇందులో పాల్గొన్న వారిని గుర్తించాలని కమిటీ అడిగింది.అయితే, సభ్యులు తమ చర్యను సమర్థించుకున్నట్లు తెలిసింది.

 

సభ ముందు చాలా ముఖ్యమయిన అంశాలు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయని, ఎమ‍్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఫిర్యాదును  పట్టించుకోని ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో తాము చేసిన గొడవ మీద చర్య తీసుకోవాలంటూ అత్యుత్సాహం ప్రదరిస్తోందని శాసన  సభ్యులు ముత్యాలనాయుడు, సునీళ్ కుమార్, సంజీవయ్య, జోగులు వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలలో ఉన్న మరికొందరు సభ్యులు కమిటీ విచారణకుహాజరు కాలేకపోయారు.



ప్రివిలేజెస్ కమిటీ చైర‍్మన్ గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ మొత్తం 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారనిఅన్నారు.  నిన్న, నేడు విచారణకు హాజరు కాని మరో ముగ్గురు సభ్యులను డిసెంబర్ 2న కమిటీ ముందు హాజరుకావాలని నోటీసు పంపినట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోగా స్పీకర్కు నివేదిక సమర్పిస్తామని సూర్యారావు తెలిపారు.

 

click me!