రివేంజా... రియల్ గా ఇదేనా... వైసిపి కార్యాలయం కూల్చివేతకు కారణమిదే..!! 

By Arun Kumar P  |  First Published Jun 22, 2024, 12:01 PM IST

నిన్నటివరకు నిర్మాణంలో వున్న వైసిపి కార్యాలయం ఇవాళ నేలమట్టం అయ్యింది. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసిపి కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ తెల్లవారుజామున  అధికారులు కూల్చేసారు. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో రివేంజ్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. గతంలో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినపనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. 2019 లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధత్యలు చేపట్టగానే ప్రజావేదిక కూల్చివేసింది. ఐదేళ్ళ తర్వాత సేమ్ ఇదే సీన్ రిపీట్ అయ్యింది... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసారు. 

 ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ప్రభుత్వ అధికారులు తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మిస్తున్న వైసిపి కార్యాలయంవద్దకు బుల్డోజర్లతో చేరుకున్నారు. పోలీస్ బందోబస్తు మద్య పిల్లర్లు పూర్తయి శ్లాబ్ దశలో వున్న భవనాన్ని కూల్చివేసారు. తెల్లారేసరికి మొత్తం నిర్మాణాన్ని నేలమట్టం చేసేసారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ శిథిలాలే మిగిలాయి. 

Latest Videos

వైసిపి ఆఫీస్ కూల్చివేతకు కారణమిదేనా..?: 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత వైఎస్  జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నివాసం నుండే గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ వ్యవహారాలను కూడా తాడేపల్లి నుండే చూసుకోవాలని అనుకున్న ఆయన ఇందుకోసం అనువైన స్థలాన్ని వెతికారు. ఈ క్రమంలో సీతానగరంలో ఓ స్థలంపై ఆయన కన్ను పడింది. 

అయితే వైసిపి కార్యాలయ నిర్మాణంకోసం గుర్తించిన స్థలం ప్రభుత్వానిది. ప్రభుత్వం అంటే తామేకదా అనుకున్నారో ఏమో ఆ స్థలంలో వైసిపి కార్యాలయ నిర్మాణం చేపట్టారు.  ఇలా సీతానగరంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన భూమిలో నిర్మాణం ప్రారంభించారు. ఈ నిర్మాణంపై అప్పుడే తెలుగుదేశం, జనసేన పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేసాయి... ఇవేవీ పట్టించుకోకుండా గత ఆరు నెలలుగా వైసిపి కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు వైఎస్ జగన్. 

సీతానగరంలో బోట్ యార్డ్ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో వైసిపి కార్యాలయ నిర్మాణం శరవేగంగా సాగింది. అయితే ఇక్కడే కార్యాలయ ఏర్పాటువెనక పెద్దకుట్రే దాగివుందని ఆరోపణలు వున్నాయి. ముందుగా రెండెకరాలను ప్రభుత్వ కార్యాలయం కోసం తీసుకుని ఆ తర్వాత మిగిలిన 15 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకోవాలన్నది వైసిపి ప్లాన్ గా  ఆరోపణలు వచ్చాయి. 

ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే వైసిపి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్నది టిడిపి ఆరోపణ. కానీ వైసిపి అధికారంలో వుండగా అధికారులెవ్వరూ ఈ భవనాన్ని టచ్ చేసే సాహసం చేయలేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా వుండవు కదా... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వైసిపి అధికారాన్ని కోల్పోయింది. టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే వైసిపి కార్యాలయంపై దృష్టిపెట్టింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారని తేల్చిన అధికారులు ఇవాళ కూల్చివేసారు. 


 
 

click me!