Latest Videos

చంద్రబాబు ఆట మొదలయ్యింది... వైసిపి కేంద్ర కార్యాలయంపై బుల్డోజర్లతో దండయాత్ర

By Arun Kumar PFirst Published Jun 22, 2024, 10:01 AM IST
Highlights

ఇవాళ తెల్లవారుజామున ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను హీటెక్కించే సంఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు సర్కార్ వైఎస్సార్ కాంగ్రెస్ పై రివేంజ్ పాలిటిక్స్ ప్రారంభించింది... ఇందులో భాగంగానే తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసారు. ఈ కూల్చివేతపై జగన్ ఏమన్నారంటే...

YSR Congress Party Office : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆట మొదలుపెట్టారు. ఇప్పటికే వైసిపి ప్రభుత్వ పాలనలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  హయాంలో చేపట్టిన పనులపై దృష్టిపెట్టింది  కూటమి సర్కార్. ఈ క్రమంలోనే తాడేపల్లిలో నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్రమంగా నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున నిర్మాణంలో వున్న వైసిపి ఆఫీసుపై జెసిబిలతో దండయాత్ర చేసింది చంద్రబాబు సర్కార్. ప్రస్తుతం వైసిపి కార్యాలయ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

శనివారం తెల్లవారుజామున భారీ పోలీస్ బందోబస్తు మధ్య తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసిపి  కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు సిఆర్డిఏ (రాజధాని ప్రాంత అభివృద్ది అథారిటీ) అధికారులు. బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో నిర్మాణంలో వున్న కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తాడేపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తాడేపల్లిలోని రెండెకరాల స్థలంలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని చేపడుతోంది వైసిపి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసిపి అధికారాన్ని కోల్పోయింది. దీంతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంపై నీలినీడలు అలుముకున్నారు.  చంద్రబాబు సర్కార్ తాజాగా ఈ కార్యాలయాన్ని కూల్చివేయిస్తోంది.

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత

ఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత.

శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు.

కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న… pic.twitter.com/zCeLpHiZPE

— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava)

 

కూటమి ప్రభుత్వ ఆదేశాలతో తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసిపి కేంద్ర కార్యాలయంపై సిఆర్డిఏ దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఈ కార్యాలయాన్ని నిబంధనలు ఉళ్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్నారని తేల్చారు. దీంతో ఈ కార్యాలయాన్ని కూల్చివేయనున్నట్లే ఆదేశాలు జారీచేసారు... ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నిన్న(శుక్రవారం) వైసిపి హైకోర్టును ఆశ్రయించింది... కార్యాలయాన్ని కూల్చకుండా చూడాలని కోర్టును కోరారు. 

ఇలా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో వుండగానే ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అనుకున్నట్లుగానే వైసిపి కార్యాలయం కూల్చివేతలు చేపట్టారు అధికారులు. తెల్లవారుజామున హటాత్తుగా తాడేపల్లిలోకి వైసిపి  కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సిఆర్డిఏ అధికారులు పిల్లర్లు పూర్తయి స్లాబ్ దశలో వున్న నిర్మాణాన్ని కూల్చివేసారు. 

ఇలా వైసిపి కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ''ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.  

''రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు @YSRCParty తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను'' అంటూ ఎక్స్ వేదికన జగన్ ట్వీట్ చేసారు. 


 

click me!