Latest Videos

జగన్ గౌరవాన్ని కాపాడిన చంద్రబాబు... అసెంబ్లీ రూల్స్ బ్రేక్ చేసిమరీ... లేకుంటేనా..!!

By Arun Kumar PFirst Published Jun 22, 2024, 9:20 AM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుందాగా వ్యవహరించబట్టే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ కోసం అసెంబ్లీ రూల్స్ నే చంద్రబాబు బ్రేక్ చేయించారని తెలిపారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణంస్వీకారం చేయించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలకు అసెంబ్లీ వేదికయ్యింది. శపథం చేసిమరి ముఖ్యమంత్రిగానే చంద్రబాబు నాయుడు సభలో అడుగుపెట్టారు... అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్న వైసిపి నాయకులను చిత్తుచిత్తుగా ఓడించిన పవన్ కల్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. నారా లోకేష్ కూడా మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసారు. 

గతంలో వైసిపి నాయకులతో నిండివున్న సభ ప్రస్తుతం పూర్తిగా పసుపుమయంగా మారింది. దీంతో అసలు మాజీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? వస్తే అతడి పరిస్థితి ఏమిటి? గతంలో మందబలంలో వైసిపి చేసిన అవమానాలకు ఇప్పుడు టిడిపి రివేంజ్ తీర్చుకుంటుందేమో? అనే అనుమానాలు కలిగాయి. సభలో వైఎస్ జగన్ కు  అవమానాలు తప్పవని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేకుండానే వైఎస్ జగన్ చాలా గౌరవంగా సభకు వచ్చి ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయారు. టిడిపి సభ్యులు అతడిని అవమానించేలా ఎక్కడా వ్యవహరించారు. అయితే ఇలా వైఎస్ జగన్ దక్కిన మర్యాదకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కారణమంటూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.  
 
అసెంబ్లీ సమావేశాల సమయంలో కొన్ని రూల్స్ పాటించాల్సి వుంటుంది. కానీ ఆ రూల్స్ ను పక్కనబెట్టిమరీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తగిన గౌరవం దక్కేలా సీఎం చంద్రబాబు హుందాగా వ్యవహరించారని పయ్యావుల కేశవ్ తెలిపారు. అందువల్లే జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రమాణస్వీకారం చేసుకొని వెళ్లిపోయారని పయ్యావుల వెల్లడించారు.  

అసెంబ్లీ రూల్స్ ప్రకారం మొదట  ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం ప్రకారం ప్రమాణస్వీకారం చేయాల్సి వుంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి హోదాకూడా లేదుకాబట్టి వైఎస్ జగన్ కు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. కానీ అతడి కోసం చంద్రబాబు ఈ రూల్స్ బ్రేక్ చేసి జగన్ కు తగిన గౌరవం ఇచ్చారని... అందువల్లే సీఎం, మంత్రుల తర్వాత జగన్ ప్రమాణస్వీకారం చేయగలిగారని పయ్యావుల తెలిపారు. 

ఇక వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చే సమయంలోనూ అసెంబ్లీ రూల్స్ సడలించినట్లు పయ్యావుల తెలిపారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష హోదా కలిగిన నాయకులు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి కారులో వెళ్లవచ్చు. సాధారణ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ గేటు బయటే కారుదిగి నడుచుకుంటూ రావాల్సివుంటుంది. ప్రస్తుతం వైసిపికి ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లుకూడా రాలేవు... కాబట్టి వైఎస్ జగన్ కూడా సాధారణ ఎమ్మెల్యేగానే సభకు రావాల్సి వుంటుంది. కానీ జగన్ కారులోనే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు... ఇందుకు కూడా చంద్రబాబే కారణమని పయ్యావుల వెల్లడించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు ఆదేశాలతోనే వైఎస్ జగన్ కారును అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించామని పయ్యావుల తెలిపారు. చిన్నచిన్న విషయాలను పట్టించుకోవద్దని... మాజీ సీఎంగా జగన్ కు తగిన గౌరవం ఇద్దామని చంద్రబాబు సూచించినట్లు పయ్యావుల తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలను కూడా సభలో హుందాగా ప్రవర్తించాలని సీఎం సూచించారు... అందువల్లే జగన్ ప్రమాణస్వీకారం సాఫీగా సాగిందన్నారు. జగన్ హోదా తగ్గించేలా వ్యవహరించవద్దన్న సీఎం ఆదేశాలతోనే హుందాగా వ్యవహరించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.


 

click me!