వైఎస్సార్ చేయూత కార్యక్రమం కోసం టెంట్.. తాళ్లని శివలింగానికి కట్టిన నిర్వాహకులు, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Sep 25, 2022, 8:12 PM IST
Highlights

వైఎస్సార్ చేయూత కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంటు తాళ్లను పక్కనే వున్న దేవాలయంలోని శివలింగానికి కట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శివాలయంలో ఈ ఘటన జరిగింది. 
 

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శివాలయంలో అపచారం చోటు చేసుకుంది. వైఎస్సార్ చేయూత కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంటు తాళ్లను పక్కనే వున్న గోలింగేశ్వరస్వామి దేవాలయంలోని శివలింగానికి కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన.. అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ‘‘ దేవుడి విగ్రహాలకు, గుళ్ళకు బులుగు పార్టీ రంగులు వేయడం చూసాం.. ఇప్పుడు ఏకంగా పార్టీ టెంట్ తాళ్ళు శివలింగానికి కట్టారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ పాపాత్ముల పాపం పండే రోజు త్వరలో’’ అంటూ ట్వీట్ చేసింది. 

 

ALso Read:వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ రూ. 2750కి పెంపు: కుప్పంలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల

 

దేవుడి విగ్రహాలకు, గుళ్ళకు బులుగు పార్టీ రంగులు వేయడం చూసాం.. ఇప్పుడు ఏకంగా పార్టీ టెంట్ తాళ్ళు శివలింగానికి కట్టారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ పాపాత్ముల పాపం పండే రోజు త్వరలో...(1/2) pic.twitter.com/GiDihSnh8L

— Telugu Desam Party (@JaiTDP)

 

ఇకపోతే.. వైఎస్ఆర్ చేయూత పథకం కింద మూడో విడత నిధులను సీఎం వైఎస్ జగన్  శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా కుప్పంలో విడుదల చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పర్యటించడం ఇదే తొలిసారి. 26.39 లక్షల మంది మహిళలకు రూ. 4,949 కోట్లను విడుదల చేశారు.  వైఎస్ఆర్ చేయూత కింద ఇప్పటివరకు రూ. 14, 110 కోట్ల సహయం చేశారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 

జగనన్న అమ్మఒడి ద్వారా 44 లక్షల 50వేల మందికి రూ. 19, 617 కోట్లు చెల్లించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ. 12, 758 కోట్లు అందించామన్నారు. చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ. 14, 110 కోట్ల సహాయం అందిందని సీఎం జగన్ తెలిపారు.సున్నా వడ్డీ కింద రూ. రూ. 3615 కోట్లు లబ్దిదారులకు అందిందని సీఎం జగన్ వివరించారు. 39 నెలల కాలంలో నాలుగు పథకాల ద్వారా తమ ప్రభుత్వం రూ. 51వేల కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ తెలిపారు.

 

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమానికై జరిగిన ఏర్పాట్లలో అతి పురాతనమైన గోలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. (1/2) pic.twitter.com/IEJwD7V6Pc

— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju)
click me!