అంతకంతకూ పెరుగుతోన్న శ్రీవారి సంపద.. లక్ష కోట్లకు చేరువలో ఆస్తులు

By Siva KodatiFirst Published Sep 25, 2022, 5:52 PM IST
Highlights

తిరుమల శ్రీవారి సంపద అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా శ్రీవారికి వున్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నాయి.
 

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ వుంటారు. స్వామి వారిని కనులారా దర్శించి, మొక్కులు చెల్లించుకుని, కానుకలు సమర్పిస్తూ వుంటారు. బంగారం, వెండి, నగదును హుండీలో వేస్తుంటారు. ఇప్పుడే కాదు ప్రాచీన కాలంలోనూ ఎందరో రాజులు, చక్రవర్తులు, జమీందార్లు స్వామి వారికి విలువైన ఆభరణాలతో పాటు వేలాది ఎకరాల భూమిని దానంగా ఇచ్చేవారు. కాలక్రమంలో వీటిలో కొన్ని ఆక్రమణలకు గురైనప్పటికీ.. కొన్నింటిని టీటీడీ కాపాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల మరో ఘనత అందుకుంది . వాటికన్ సిటీ తర్వాత అత్యంత సంపన్న ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల నిలిచింది. 

దేశవ్యాప్తంగా శ్రీవారికి వున్న ఆస్తుల విలువ రూ.85,705 కోట్లని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 960 ఆస్తులు 7,123 ఎకరాల్లో విస్తరించి వుందని ఆయన వెల్లడించారు. 1974 నుంచి 2014 మధ్య టీటీడీ 113 ఆస్తులను కోల్పోవాల్సి వచ్చిందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు తాము ఏ ఒక్క ఆస్తిని వదులకోలేదని ఆయన వెల్లడించారు. అలాగే టీటీడీకి దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నాయి. దీనితో పాటు 14 టన్నుల బంగారం కూడా శ్రీవారి సొంతం. 

ALso REad:బహ్మోత్సవాల తర్వాత సర్వదర్శనం భక్తులకు టోకెన్లు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

ఇకపోతే... శనివారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి పలు అంశాలపై చర్చించింది. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రూ. 95 కోట్లతో యాత్రికులకు నూతన వసతి సుముదాయాల నిర్మాణం చేపట్టాలని టీడీపీ పాలకమండలి నిర్ణయించింది. తిరుపతిలో వకుళామాత ఆలయం అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వడమాలపేట దగ్గర రూ. 25 కోట్లతో 130 ఎకరాల కొనుగోలుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ. 7.90 కోట్లతో తిరుమలలోని కాటేజీల్లో గీజర్లు, ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ. 30 కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. రూ. 2.45 కోట్లతో నదకం అతిథి గృహంలో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది
 

click me!